Begin typing your search above and press return to search.

వాళ్ల ఆట.. 9 కోట్లు తెచ్చిపెట్టింది

By:  Tupaki Desk   |   18 April 2016 9:38 AM IST
వాళ్ల ఆట.. 9 కోట్లు తెచ్చిపెట్టింది
X
దక్షిణ భారత నటీనటుల (నడిగర్‌) సంఘం భవన నిర్మాణానికి నిధులు సమకూర్చడం కోసం ఆదివారం చెన్నైలో ‘నక్షత్ర క్రికెట్‌’ పేరుతో తలపెట్టిన క్రికెట్ కప్ సూపర్ హిట్ అయింది. తమిళ సినీ పరిశ్రమ నుంచే కాక.. తెలుగు-కన్నడ-మలయాళ సినీ పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద నటీనటులు హాజరై ఈ వన్ డే టోర్నీని విజయవంతం చేశారు. నడిగర్ సంఘం భవనం కోసం చేసిన రూ.2 కోట్ల అప్పును తీర్చడానికి ఈ టోర్నీ తలపెడితే.. ఏకంగా రూ.9 కోట్ల ఆదాయం వచ్చింది. స్పాన్సర్షిప్.. టీవీ హక్కులు కలిపి మొత్తం ఈ కప్ ద్వారా సమకూరిన రూ.9 కోట్ల ఆదాయానికి సంబంధించిన చెక్కును సన్ టీవీ యాజమాన్యం.. నడిగర్ సంఘానికి అందజేసింది.

తమిళ పరిశ్రమకు రెండు కళ్లు అనదగ్గ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ - విశ్వనటుడు కమల్‌హాసన్ ఈ పోటీలను ప్రారంభించగా.. తెలుగు పరిశ్రమ నుంచి బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్‌.. ‘మా‘ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌.. శ్రీకాంత్ తదితరులు.. మలయాళ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టి.. నివిన్ పౌలీ.. కన్నడ పరిశ్రమ నుంచి శివరాజ్‌కుమార్‌.. సుదీప్ తదితరులు అతిథులుగా విచ్చేసి ఈ టోర్నీకి తమ మద్దతు ప్రకటించారు. ఇక తమిళ పరిశ్రమకు చెందిన నటులు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడారు. సూర్య నేతృత్వంలోని జట్టు విజేతగా నిలిచింది. మండుటెండలోనూ తారలు ఉత్సాహంగా మ్యాచ్ లు ఆడారు. నడిగర్ సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న నాజర్.. విశాల్.. కార్తి తదితరులు టోర్నీని సమర్థంగా నిర్వహించారు. శ్రుతి హాసన్.. తమన్నా.. సమంత లాంటి అగ్ర కథానాయికలు స్టేడియంలో సందడి చేశారు. ఆదివారం విక్రమ్ పుట్టిన రోజు కావడంతో స్టేడియంలోనే ఆ వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించారు.