Begin typing your search above and press return to search.

కోహ్లికి పెద్దాయన గట్టిగా ఇచ్చాడుగా..

By:  Tupaki Desk   |   19 Dec 2018 7:11 AM GMT
కోహ్లికి పెద్దాయన గట్టిగా ఇచ్చాడుగా..
X
మైదానం లో విరాట్ కోహ్లి దూకుడు ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వికెట్ పడితే ఊగిపోతాడు. సెంచరీ కొడితే రెచ్చిపోతాడు. ఎగిరెగిరి దూకుతాడు. అరుస్తాడు. ప్రత్యర్థుల వైపు అదోలా చూస్తాడు. కొన్నిసార్లు వెక్కిరిస్తాడు. కొన్నిసార్లు వాగ్వాదానికీ దిగుతాడు. అతడి వ్యవహారం కొందరికి బాగానే అనిపిస్తుంది. ఇంకొందరికి నచ్చదు. ఆట లో ఆ ఉత్సాహం.. ఆ దూకుడు ఉండాలని కొందరంటే.. కెప్టెన్ అనేవాడు హుందాగా ఉండాలని అంటారు ఇంకొందరు. ఐతే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కోహ్లి తీరు మార్చుకోడు. మైదానం లో తన దూకుడును కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ విషయమై బాలీవుడ్ దిగగజ నటుడు నసీరుద్దీన్ షా స్పందించాడు. ఆయన కోహ్లి తీరును తప్పుబట్టాడు.

కోహ్లి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌ మన్ మాత్రమే కాదని.. ప్రపంచ క్రికెట్లో అత్యంత చెత్త ప్రవర్తన కూడా అతడిదే అని ఆయన తీవ్ర విమర్శ చేశారు. విరాట్ క్రికెట్ నైపుణ్యం.. అతడి అహంకారం.. చెడు ప్రవర్తన వల్ల మసక బారుతోందని నసీరుద్దీన్ అన్నారు. పనిలో పనిగా విరాట్ ను ఉద్దేశించి ఇంకో సెటైర్ కూడా వేశారు నసీరుద్దీన్. తానేమీ ఇండియా వదిలి వెళ్లట్లేదని.. తనకలాంటి ఉద్దేశాలేమీ లేవని ఆయన అన్నారు. ఇంతకుముందు ఒక అభిమాని కోహ్లిని ఓవర్ రేటెడ్ ప్లేయర్ గా అభివర్ణిస్తూ.. తన కు ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా క్రికెటర్లే ఎక్కువ ఇష్టం అన్నాడు. దీని పై కోహ్లి స్పందిస్తూ.. అలాంటపుడు నువ్వు ఇండియా లో ఎందుకుంటున్నావ్.. విదేశాలకు వెళ్లిపో అని వ్యాఖ్యానించాడు. దాన్ని ఉద్దేశించే కోహ్లిని వ్యతిరేకించినంత మాత్రాన తాను ఇండియా వదిలి వెళ్లబోవట్లేదని సెటైర్ పేల్చారు నసీరుద్దీన్.