Begin typing your search above and press return to search.

మా ఎల‌క్ష‌న్‌: న‌రేష్ కృషిని గుర్తించాలి!

By:  Tupaki Desk   |   8 March 2019 5:44 PM GMT
మా ఎల‌క్ష‌న్‌: న‌రేష్ కృషిని గుర్తించాలి!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 10న ఈ ఎన్నిక‌లు పూర్త‌వుతాయి. అదే రోజు సాయంత్రానికి కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రు? ప‌్యానెల్ ఏది? అన్న‌ది తేలిపోతుంది. ఆ క్ర‌మంలోనే శివాజీ రాజా - న‌రేష్ ప్యానెల్స్ గెలుపే ధ్యేయంగా ఆర్టిస్టుల‌ను క‌లుస్తున్నారు. ఓట్లు అడుగుతున్నారు. గ‌త నాలుగు రోజులుగా ఇరు వ‌ర్గాలు మీడియాల‌కెక్కి చేస్తున్న ర‌చ్చ ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. న‌రేష్ ప్యానెల్ ఆరోప‌ణ‌ల్ని తిప్పికొడుతూ గురువారం సాయంత్రం శివాజీ రాజా ప్యానెల్ ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసింది. ప్ర‌తి సంద‌ర్భంలో న‌రేష్ - శివాజీ రాజా మ‌ధ్య తీవ్ర‌మైన వ్య‌క్తిగ‌త మ‌న‌స్ఫ‌ర్థ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే ఈ విమ‌ర్శ‌ల్లో అస‌లు న‌రేష్ `మా` కార్య‌క‌లాపాల‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని, అత‌డికి స‌రైన అటెండెన్స్ కూడా లేనేలేద‌ని విమ‌ర్శించారు. న‌రేష్ ఆర్టిస్టుల కోసం చేసిందేమిటో ఆర్టిస్టుల‌కే తెలుసును అని అన్నారు.

అయితే అత‌డి విమ‌ర్శ‌ల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే అస‌లు న‌రేష్ `మా`కోసం ప‌నులేవీ చేయ‌లేదా? ఆర్టిస్టుల అభివృద్ధికి అత‌డు కృషి చేయ‌లేదా? అంటే ... న‌రేష్ త‌న ప్యానెల్ ప్ర‌క‌ట‌న రోజునే దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు. పెన్ష‌న్ .. హెల్త్ కార్డ్.. ఎడ్యుకేష‌న్ స‌పోర్ట్ కి సంబంధించిన మూడు నెల‌ల పాటు స‌ర్వే నిర్వ‌హించేందుకు ఆర్టిస్టుల్లో తిరిగాన‌ని న‌రేష్ తెలిపారు. మాదాల ర‌వితో క‌లిసి దీనిని ప‌రిశోధించామ‌ని అన్నారు. ఈ శోధ‌న‌లో ఆర్టిస్టుల‌కు సంబంధించి చాలానే తెలిసాయని తెలిపారు. అవ‌కాశాలు కావాలి అని అడిగేవాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు. అలాంటి ఆర్టిస్టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు సాయం చేశానని అన్నారు. మా కృషి వ‌ల్ల ఆర్టిస్టుల్లో 60 మందికి అవ‌కాశాలొచ్చాయి. అంద‌రూ ధ‌న్య‌వాదాలు తెలిపారు. చాలా మంది ఆర్టిస్టుల‌కు వాహ‌నాలు ఇచ్చాం. బ‌స్సుల్లో వెళ్లే వాళ్ల‌కు 18 మందికి బైక్ లు కొనిచ్చాం. ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష‌ణ యోజ‌న ద్వారా ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నించాం. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు 2ల‌క్ష‌లు చొప్పున‌ న‌లుగురికి సాయం చేశాం.. అని త‌న కృషిని న‌రేష్ మీడియా ముఖంగా వివ‌రించారు.

న‌రేష్ ఇచ్చిన వివ‌రాల్లో ఎలాంటి త‌ప్పిదం లేదు. అప్ప‌టికి శివాజీ రాజా- న‌రేష్ మ‌ధ్య ఏ విభేధాలు పొడ‌చూప‌లేదు. శివాజీ రాజా- న‌రేష్ క‌వ‌ల‌ల్లా క‌లిసి ప‌ని చేశారు. అందువ‌ల్ల‌నే `మా` ఎన్నో మంచి ప‌నులు చేసింది. ద‌శాబ్ధాల పాల‌న‌లో ఏ ఇత‌ర క‌మిటీ చేయ‌న‌న్ని మంచి ప‌నులు శివాజీ రాజా- న‌రేష్ బృందం చేసింది. అయితే అన్ని మంచి ప‌నులు చేసి చివ‌రిలో అబాసు పాల‌య్యారు. వ్య‌క్తిగ‌తంగా కొన్ని మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఇద్ద‌రి మ‌ధ్యా వ‌చ్చాయి. ఆ క్ర‌మంలోనే ఆ గొడ‌వ‌లు చినికి చినికి గాలివాన‌య్యాయి. దాంతో ఒక‌రిపై ఒక‌రు అభాండాలు వేసుకోవ‌డం.. మీడియాల‌కెక్క‌డంతో ఇంత ర‌చ్చ‌య్యింది. అందుకే ఎల్లుండు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో శివాజీ రాజా కానీ - న‌రేష్ కానీ ఎవ‌రో ఒక‌రు అధ్య‌క్షుడు అయితే ఇప్ప‌టివర‌కూ చేసిన మంచి ప‌నుల్ని కొన‌సాగించే అవ‌కాశం ఉంది. అది ఆర్టిస్టుల‌కు ఎంతో మేలు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అప్పుడైనా `క‌లిసి ఉంటేనే క‌ల‌దు సుఖం` అన్న‌ది ఇరువురు గ్ర‌హించి మునుముందు చేయాల్సిన ప‌నుల‌పైనా దృష్టి సారించాల్సి ఉంటుంది. క‌లిసే మ‌హేష్ స‌హా స్టార్ల ఈవెంట్ల‌ను నిర్వహించి మా అసోసియేష‌న్ కి నిధిని సేక‌రించి సొంత బిల్డింగ్ నిర్మించాల్సి ఉంటుంది. మ‌రి అందుకోస‌మైనా ఆ ఇద్ద‌రూ క‌లుస్తారేమో చూడాలి.