Begin typing your search above and press return to search.

నారప్పా.. ఇదేందప్పా..? మణిశర్మకు చేదుఅనుభవం!

By:  Tupaki Desk   |   17 Jan 2021 8:02 AM GMT
నారప్పా.. ఇదేందప్పా..? మణిశర్మకు చేదుఅనుభవం!
X
టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితా తీస్తే.. తప్పకుండా అందులో మణిశర్మ పేరు ఉంటుంది. ఆయన స్వరాలలో ఓలలాడిన తెలుగు ప్రేక్షకులు.. మెలోడీ బ్రహ్మ అని కీర్తించారు. పాటలే కాదు.. ‘అంతకు మించి’ అన్న రీతిలో ఉంటుంది మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్. అలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. అది కూడా మన తెలుగులోనే..!

మణిశర్మ సంగీతం కోసం వేచిచూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా “ఇస్మార్ట్ శంకర్”తో ఘనంగా పునరాగమనం చాటుకున్నారు ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన చేతిలో బడా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అందులోని ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు నారప్ప. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం.

తమిళ్ లో ఘన విజయం సాధించిన ‘అసురన్’కు ఇది రీమేక్. అయితే.. ఈ నారప్ప విషయంలో ఎన్నడూ ఎదుర్కోనటువంటి చేదు అనుభవాన్ని చవిచూశారట మణిశర్మ. ఈ విషయాన్ని స్వయంగా మణిశర్మే ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నారప్ప సినిమాకు సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలైంది. అయితే.. ఒరిజినల్ వెర్షన్ “అసురన్” బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను మణిశర్మ ప్రమేయం లేకుండా యాడ్ చేసి, విడుదల చేశారట మేకర్స్. అంతేకాకుండా.. మణిశర్మ పేరు కూడా వేశారట.

దీంతో.. తమిళ్ ‘అసురన్’ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను మణిశర్మ కాపీ కొట్టాడని అందరూ అన్నారట. ఈ విషయం పెద్ద కాంట్రావర్సీ కూడా అయ్యిందని తెలిపారు మణిశర్మ. నిజానికి.. తెలుగులో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. మొదటగా గుర్తొచ్చేది మణిశర్మ. సప్త స్వరాల్లో దేనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నైనా అద్భుతంగా అందిస్తారు ఆయన. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరి, నారప్ప మేకర్స్ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? మణిశర్మకు ఈ విషయంలో ఎలాంటి సంజాయిషీ ఇస్తారు? అనేది చూడాలి.