Begin typing your search above and press return to search.

అమెరికాలో నారా రోహిత్ చేతుల మీదుగా..

By:  Tupaki Desk   |   13 Sept 2016 3:23 PM IST
అమెరికాలో నారా రోహిత్ చేతుల మీదుగా..
X
‘పెళ్లిచూపులు’ సినిమాతో సూపర్ పాపులర్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. దీని తర్వాత అతను చేస్తున్న సినిమాలన్నింటిపైనా ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. విజయ్ నెక్స్ట్ రిలీజ్.. ద్వారక. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ప్రద్యుమ్న.. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సరసన ‘రైట్ రైట్’ ఫేమ్ పూజా జవేరి కథానాయికగా నటించింది. ఇప్పటికే ఓ టీజర్ రిలీజ్ చేసిన ‘ద్వారక’ టీం.. ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించింది. త్వరలోనే హైదరాబాద్‌ లో ఆడియో వేడుక చేయబోతున్నారు.

ఈ లోపు అమెరికాలో ‘ద్వారక’ పాటలు రెండు విడుదలయ్యాయి. వీటిని యువ కథానాయకుడు నారా రోహిత్ రిలీజ్ చేశాడు. ‘పెళ్లిచూపులు’ మిలియన్ క్లబ్బులోకి చేరిన నేపథ్యంలో విజయోత్సవంలో పాల్గొనేందుకు విజయ్.. ఇటీవలే అమెరికాకు వెళ్లాడు. మరోవైపు ‘జ్యో అచ్యుతానంద’ ప్రిమియర్ షోలకు అటెండవడానికి నారా రోహిత్ కూడా అమెరికా చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి ‘ద్వారక’ పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పెళ్ళిచూపులు చిత్రంతో విజయ్‌దేవరకొండ యువతకు బాగా చేరువయ్యాడు. ‘ద్వారక’ అతన్ని కుటుంబ ప్రేక్షకులకీ దగ్గర చేస్తుంది. ఓ చక్కటి ప్రేమకథని వినోదాత్మకంగా తెరకెక్కించాం. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే హైదరాబాద్‌ లో ఆడియో వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు.