Begin typing your search above and press return to search.

అప్పట్లో ఒకడుండేవాడు.. ఏంటి కథ?

By:  Tupaki Desk   |   26 July 2016 4:28 AM GMT
అప్పట్లో ఒకడుండేవాడు.. ఏంటి కథ?
X
సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో సాగిపోతుంటాడు నారా రోహిత్. ఇప్పటిదాకా అతను చేసిన ప్రతి సినిమా భిన్నంగా కనిపించిందే. ఆసక్తి రేకెత్తించిందే. కథాకథనాల విషయంలో తనది ప్రత్యేకమైన శైలి అని రుజువు చేసుకున్నాడు రోహిత్. నారా వారబ్బాయి కొత్త సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోంది. సోమవారం రోహిత్ పుట్టిన రోజు నేపథ్యంలో విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు ఇండస్ట్రీతో పాటు సామాన్య జనాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఆ పోస్టర్లలో ఒక ఇంటెన్సిటీ కనిపించింది. ఇదేదో ప్రత్యేకమైన సినిమా అన్న ఫీలింగ్ కలిగించాయి ఆ పోస్టర్లు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ గురించి.. అందులోని పాత్రల గురించి యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది సెన్సేషన్ క్రియేట్ చేసేలాగా కనిపిస్తోంది. ఈ చిత్ర కథ 1922-96 మధ్య కాలంలో సాగుతుందట. ఇందులో రోహిత్ ముస్లిం కుర్రాడి పాత్ర పోషిస్తుండటం విశేషం. రోహిత్ గత సినిమాలు కొన్నింట్లో కీలక పాత్రలు చేసిన శ్రీవిష్ణు కూడా హీరో తరహా పాత్రే చేస్తున్నాడు ఇందులో. అతను క్రికెటర్ కాబోయి క్రిమినల్ అయిన కుర్రాడి పాత్రలో కనిపిస్తాడు. ఈ కథకు మహాభారతానికి లింకు ఉంటుందట. మహాభారతంలో కర్ణుడు-దుర్యోధనుడు ముందు శత్రువులుగా కనిపించి.. చివరికి స్నేహితులుగా మారినట్లు.. ఇందులోని ప్రధాన పాత్రల తీరు కూడా ఉంటుందని.. క్రికెట్.. మాఫియా.. గ్లోబలైజేషన్.. లాంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని దర్శకుడు సాగర్ చంద్ర అంటున్నాడు. సాగర్ ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘అయ్యారే’ అనే సినిమా తీశాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.