Begin typing your search above and press return to search.

కథ.. కథనమే.. నారా రోహిత్ బలం

By:  Tupaki Desk   |   16 Sept 2015 1:00 PM IST
కథ.. కథనమే.. నారా రోహిత్ బలం
X
నారా వారి కుటుంబం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి... తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న యంగ్ హీరో.. నారా రోహిత్. చూడటానికి బొద్దుగా వుండే.. ఈ హీరో.. ఎన్టీఆర్ లా డ్యాన్స్ లు చేయలేడు.. ప్రభాస్ లా ఫైటింగులూ చేయలేడు. మహేష్ బాబులా పంచ్ లు పేల్చలేడు. అయితేనేం.. అతను నేటి తరం యువ నటుల్లో అతనిదో శైలి. ఇరగ దీసే డ్యాన్సులు.. అదరగొట్టే ఫైటింగులు చేయకపోయినా.. తనకు నచ్చిన మేనరిజంతో వెండితెరపై రాణిస్తున్నాడు. ఏదో వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకుని ఏడాదికి ఓ డజను సినిమాల్లో నటించేద్దాం అనుకోకుండా.. రాసి కంటే.. వాసి ముఖ్యమనే ఉద్దేశంతో.. తనకు నచ్చిన కథలను నమ్ముకుని టాలీవుడ్లో తన ప్రయాణం సాగిస్తున్నాడు. తనకున్న బ్యాక్ గ్రౌండ్ కు చాలా మంది నిర్మాతలు క్యూలో నిల్చోవచ్చు. కానీ అందరికీ అవకాశం ఇవ్వడు. వారి వద్ద బలమైన కథ వుంటేనే అవకాశం ఇస్తాడు. లేదంటే.. నిర్మొహమాటంగా కాల్షీట్స్ లేవ్ అనేస్తాడు ఈ నారా వారబ్బాయి.

సాధారణంగా ఏ హీరోనైనా.. సినిమా ఒప్పుకున్నాడు అంటే.. అది మంచి బ్యానరైనా అయ్యి వుండాలి.. లేదా దర్శకుణ్ని చూసైనా ఒప్పుకుని వుండాలి. ముఖ్యంగా నేడు యువ హీరోలంతా ఇదే ఫాలో అవుతున్నారు. కాని నారా రోహిత్ థాట్ మాత్రం వీరికి విభిన్నంగా వుంటుంది. డైరెక్టర్ ఎవరనేది చూడడు.. నిర్మాత ఎవరనేది పట్టించుకోడు. తనకు కథ నచ్చితే చాలు.. ఓకే చెప్పేస్తాడు. దానికి బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటి వరకు నారా రోహిత్ నటించిన చిత్రాలన్నీ దీనినే రుజువు చేస్తాయి. విడుదలై విజయం సాధించిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకం. తన మొదటి చిత్రం బాణం మొదలు కొని.. సోలో - ప్రతినిధి - ఒక్కడినే - రౌడీఫెలో - అసుర వరకు అన్నీ విభిన్న నేపథ్యం వున్న కథలే.

ప్రస్తుతం ఓ ఆరు సినిమాల్లో నటిస్తున్న నారా రోహిత్.. ఇవన్నీ కూడా కథా బలం వున్న సినిమాలే. అందులో సావిత్రి లాంటి లేడీ పేరుగల సినిమా కూడా ఒకటుంది అంటే.. కథకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో తెలిసిపోతోంది. నిత్య మీనెన్ ది ఇందులో టైటిల్ రోల్. శంకర, పండగలా వచ్చాడు, అప్పట్లో ఒకడు ఉండేవాడు, వీరుడు లాంటి సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. చివరకు ఎ.ఆర్.మురగదాస్ లాంటి ఏస్ డైరెక్టర్ కథ అందిస్తున్న ఓ సినిమాలో నారా రోహిత్ నటిస్తున్నాడు. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా... కథనే నమ్ముకుని ప్రయాణిస్తున్న హీరో ఒక్క నారా రోహిత్ అనే చెప్పొచ్చు. తాజాగా వారాహి బ్యానర్ లో రెండు సినిమాలు చేయడానికి నారా రోహిత్ ఒప్పుకున్నాడు. ఇతను తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెప్టెంబరు 16కి ఆరేళ్లవుతోంది. అతని తొలి చిత్రం బాణం 2009 సెప్టెంబరు 16న విడుదలైంది.