Begin typing your search above and press return to search.

తెలంగాణ పిలగాడుగా దుమ్మురేపేయనున్న నాని

By:  Tupaki Desk   |   23 Dec 2021 11:32 AM GMT
తెలంగాణ పిలగాడుగా దుమ్మురేపేయనున్న నాని
X
నాని - రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా సిద్ధమైంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. " ఒక మంచి కథకు అందుకు తగిన ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు దొరకడం చాలా కష్టం. కానీ మా అదృష్టం కొద్దీ 'శ్యామ్ సింగ రాయ్'కి అన్నీ కూడా అద్దినట్టుగా కుదిరాయి. అందువలన ఈ సినిమా అనుకున్నదానికంటే కూడా మంచిగా వచ్చింది.

ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో సంఘటనలు అందమైన ఙ్ఞాపకాలుగా మారిపోయాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు అవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మా నమ్మకం పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాలో నా లుక్ .. సాయిపల్లవి కాంబినేషన్ లోని కొన్ని షాట్స్ చూసి, ఇది కమల్ హాసన్ చేసిన 'నాయకుడు' సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. కథాకథనాల పరంగా ఆ సినిమాతో ఈ సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు .. ఎలాంటి పోలిక కూడా ఉండదు. థియేటర్ కి వెళ్లిన తరువాత ఈ విషయం మీకు అర్థమవుతుంది.

ఈ సినిమాలో హైలైట్ అనిపించే నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. అవి ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. గూస్ బంప్స్ తెప్పించే ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకులతో పాటే కొంతకాలం పాటు ఉండిపోతాయి. 'శ్యామ్ సింగ రాయ్' పాత్ర కోసం నేను బరువు పెరగలేదు .. 'వాసు' పాత్ర కోసం బరువు తగ్గలేదు. ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు మీకు అలా అనిపించి ఉండొచ్చు. 'జెర్సీ' తరువాత నా కెరియర్లో నాకు నచ్చిన సినిమా ఇది. ఎప్పుడూ కూడా నేను 'సత్యం' థియేటర్ కి వెళ్లి నా సినిమా రెస్పాన్స్ ఎలా ఉందనేది వెనక నుంచుని చూస్తుంటాను. రెండేళ్ల తరువాత మళ్లీ అలాంటి అవకాశం దొరికింది.

ప్రస్తుతం నా చేతిలో 'అంటే .. సుందరానికీ!' .. 'దసరా' సినిమాలు ఉన్నాయి. 'దసరా' సినిమాలో నేను తెలంగాణ యాస మాట్లాడతాను. తెలంగాణ పిలగాడినే అనుకునేంత స్పష్టంగా ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడతాను. ఈ పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇక నుంచి నా సినిమాలు మిగతా దక్షిణాది భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటాను. మంచి కథ దొరికితే హిందీలో చేయడానికి కూడా సిద్ధమే. ఇక బాలయ్యతో కలిసి చేసిన 'అన్ స్టాపబుల్' ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ .. "నిజంగా బాలకృష్ణగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన చాలా మంచివారు .. ఆయన గురించి బయట వినేదాంట్లో నిజం లేదనే విషయం నాకు అర్ధమైంది. అందరితోను ఒకేలా ఉండటం ఆయన ప్రత్యేకత" అని చెప్పుకొచ్చాడు.