Begin typing your search above and press return to search.

పరిచయ వేడుకతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న నాని..!

By:  Tupaki Desk   |   27 March 2021 7:28 AM GMT
పరిచయ వేడుకతో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న నాని..!
X
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ''టక్ జగదీష్'' ఏప్రిల్ 23న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో నాని ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈరోజు శనివారం సాయంత్రం 'పరిచయ వేడుక' పేరుతో రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్ లో గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు.

నానితో పాటుగా చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యే ఈ కార్యక్రమంలో 'టక్ జగదీష్' సినిమాకి వర్క్ చేసిన అందరినీ పరిచయం చేయనున్నారు. ఇకపోతే ఈరోజు నుంచి సినిమా విడుదల అయ్యే వరకు ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ గట్టిగా ప్లాన్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో 'పరిచయ వేడుక' ప్రోగ్రామ్ చేసి.. అలానే రాయలసీమ - తెలంగాణ ప్రాంతాల్లో మరో రెండు పెద్ద ఈవెంట్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఇప్పుడు అంచనాలను రెట్టింపు చేసేలా ఈ చిత్రానికి పబ్లిసిటీ చేయనున్నారని తెలుస్తోంది.

'టక్ జగదీష్' చిత్రంలో నాని జగదీష్ నాయుడిగా కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ నటిస్తున్నారు. జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.