Begin typing your search above and press return to search.

'జర్సీ' విషయంలో నాని సూపర్బ్‌ ప్లానింగ్‌

By:  Tupaki Desk   |   27 Nov 2018 4:33 PM GMT
జర్సీ విషయంలో నాని సూపర్బ్‌ ప్లానింగ్‌
X
నాని హీరోగా గౌతమ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం ‘జర్సీ’. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ గా శ్రద్దా శ్రీనాథ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించిన నాని అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఏప్రిల్‌ మాసంలో పలు పెద్ద సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. అయినా కూడా ఏమాత్రం టెన్షన్‌ లేకుండా నాని తన సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు డేటును కూడా అనౌన్స్‌ చేశాడు.

‘జర్సీ’ చిత్రం విడుదల తేదీని ఇంత ముందు ప్రకటించడం వెనుక నాని సూపర్బ్‌ ప్లానింగ్‌ ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఏప్రిల్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ - మహేష్‌ బాబు ‘మహర్షి’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల ప్రకటన వచ్చింది. అయితే తేదీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కనుక నాని తన సినిమా తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం వల్ల విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని - ఏ ఇతర మూవీ వల్ల వాయిదా వేయాల్సిన పరిస్థితి రాదనేది నాని అండ్‌ కో ప్లాన్‌ గా తెలుస్తోంది.

డేట్‌ ఫిక్స్‌ చేయకుండా కేవలం ఏప్రిల్‌ అంటూ ప్రకటిస్తే ఆ సినిమాల విడుదల తేదీలకు అనుగుణంగా జర్సీని వాయిదా వేయడమో లేదంటే - అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోవడమో జరగవచ్చు. అందుకే నాని తన సినిమా విడుదల తేదీని అప్పుడే ప్రకటించినట్లుగా అనిపిస్తోంది. సినిమా విడుదలకు సరైన ప్లానింగ్‌ లేకుంటే విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలు అదే సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. అందుకే నాని అండ్‌ కో ముందస్తు వ్యూహంతో డేట్‌ ను ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని నాని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.