Begin typing your search above and press return to search.

నాని మార్కెట్ రేంజ్ ఎంత?

By:  Tupaki Desk   |   10 May 2019 7:00 AM IST
నాని మార్కెట్ రేంజ్ ఎంత?
X
మినిమ‌మ్ గ్యారెంటీతో బయ్యర్లకు సేఫ్ గేమ్ అనిపించే సినిమాలతో కెరీర్ లాగించేస్తున్న నాని ఇప్పుడు తెలుగునాట న్యాచురల్ అనే ట్యాగ్ ఉన్న ఓ రేంజ్ స్టార్. భారీ డిజాస్టర్లు లేని హీరోగా కూడా నానికి బాగానే పేరుంది. వ‌ర‌సగా 8 హిట్లు వ‌చ్చాయ‌ని స్వ‌యంగా నానినే చాలా సార్లు చెప్పాడు. అయితే ఇదంతా నిజమేనా అనే సందేహం కలగడం సహజం.

క‌లెక్ష‌న్ల లెక్క‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని ప్రేక్ష‌కుల‌కి అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నాని హిట్ ట్రాక్ రికార్డ్ ఉన్న హీరోనే కావొచ్చు కానీ నాని మీద గ్రౌండ్ లెవెల్ లో కొంత విభిన్నమైన టాక్ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు బ‌య్య‌ర్లు నాని విష‌యంలో ఏమంత గొప్ప సంతృప్తితో లేరనే మాట ప్రతి కొత్త విడుదల హంగామా తర్వాత వినిపిస్తూనే ఉంటుంది

భలే భలే మగాడివోయ్ తో పీక్స్ చేరిన నానికి టైమ్ బాగా న‌డుస్తున్న స‌మ‌యంలో విడుద‌లైన నేను లోక‌ల్ - ఎమ్ సి ఏ వంటి సినిమాలు త‌ప్పితే మ‌జ్ను- కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు కొనుకున్న వాళ్ల‌కి 20 శాతం నుంచి 40 శాతం నష్టాలే మిగిల్చాయి. మ‌జ్ను అయితే కొన్ని ఏరియాల్లో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. చాలా పరిమిత బడ్జెట్ కాబట్టి నిర్మాతలకు నష్టం కలగకుండా గట్టెక్కారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ గొప్ప పేరు తీసుకురాకపోయినా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. డబ్బులూ వచ్చాయి. కాకపోతే అప్పటి నాని మార్కెట్ కి కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టడం వల్ల రిటర్న్స్ సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి.

జెంటిల్ మెన్ టాక్ తో పాటు నానికి హిట్ ముద్రనే ఇచ్చింది. అయితే ఇదంతా కాస్త ఎక్కువగా హైప్ చేసి నానితో సినిమా చేస్తే త‌ప్ప‌క హిట్ అవుతుంద‌నే బ్రాండింగ్ బాగా చేశారు. ఎంసిఏ రొటీన్ గా ఉందన్న టాక్ వినిపించినప్పటికీ నానితో సాయి పల్లవి కాంబో ప్లస్ దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీ దాన్ని హిట్ ఖాతాలో పడేలా చేశాయి. కాని కృష్ణార్జున యుద్ధం మాత్రం గొప్ప పాఠం నేర్పింది. డిజాస్టర్ దెబ్బ ఎలా ఉంటుందో నానికి ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. స్వయంగా తనే సోషల్ మీడియాలో ఇది ఆడలేదు అని ఒప్పేసుకున్నాడు కూడా

అయితే క్రేజీగా వచ్చిన మల్టీ స్టారర్ దేవ‌దాసు కూడా కొనుకున్న వాళ్ల‌కి నిరాశే మిగ‌ల్చింది, దాదాపు 20 శాతం న‌ష్టంతో ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ముగిశాయి. నాగ్ తో కలిసి చేసినా ఫలితం దక్కలేదు. ఇక నాని కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా ఆకాశానికి ఎత్తేస్తూ అభివ‌ర్ణిస్తున్న జెర్సీ కూడా న‌ష్టాల దారిలోనే న‌డుస్తోంది. విమ‌ర్శ‌కులు ప్ర‌శంసలు అందుకున్న‌ప్ప‌టికీ, ఈ సినిమాను కేవలం కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులే ఆద‌రించారు. ముఖ్యంగా బీ - సీ సెంటర్స్ నుంచి జెర్సీకి ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.

దీనికి తోడు కాంచ‌న 3 కార‌ణంగా జెర్సీ క‌లెక్ష‌న్స్ కు భారీగానే గండి పడింది. జెర్సీ క‌లెక్ష‌న్స్ లో 75 శాతానికి పైగా కాంచ‌న 3 ఎత్తుకెళ్లిపోయిందని ట్రేడ్ టాక్. లారెన్స్ లాంటి డబ్బింగ్ హీరోను ధీటుగా ఎదురుకోలేకపోయాడని నాని మీద కామెంట్స్ వచ్చాయి. దీంతో నాని పై మ‌ళ్లీ హోప్స్ పెట్టుకున్న డిస్ట్రీబ్యూట‌ర్స్ జెర్సీ విషయంలో హ్యాపీగా లేకపోవడం నిర్మాతలకు ఇబ్బంది కలిగించేదే. నాని సినిమాల‌కు హిట్ టాక్ వ‌చ్చినా ఓ 30 శాతం న‌ష్టాలు మాములే అని ట్రేడ్ స‌ర్కిల్స్ కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. దానికి జెర్సీనే ఉదాహరణగా చూపిస్తున్నారు. దీని ప్రకారం చూస్తే నాని గట్టిగా కిక్కిచ్చే ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే కాని వీటికి చెక్ పడదు.