Begin typing your search above and press return to search.

నాని పెంచుతాడా.. దించుతాడా?

By:  Tupaki Desk   |   19 May 2018 3:30 PM GMT
నాని పెంచుతాడా.. దించుతాడా?
X
అనేకానేక సందేహాలకు తెరదించుతూ గత ఏడాది తెలుగులోకి అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో అంచనాల్ని మించి విజయం సాధించింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్.. అతడి వాక్చాతుర్యం.. మరోవైపు పార్టిసిపెంట్ల ఆకర్షణ కూడా తోడై షో బాగానే విజయవంతమైంది. మరి ఈసారి ‘బిగ్ బాస్’ సీజన్ ఎలా నడుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా కొత్తగా ఉన్నపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకసారి దానికి అలవాటు పడ్డాక.. జనాలకు నెమ్మదిగా మొహం మొత్తడం మొదలవుతుంది. ఏదో ఒక ప్రత్యేకత.. కొత్తదనం ఆశిస్తారు. అది లేకుండా ఫలితం తేడా కొట్టేస్తుంది. ‘బిగ్ బాస్’ విషయంలోనూ ఆ ప్రమాదం పొంచి ఉంది. రెండో సీజన్‌ కు ఎన్టీఆర్ దూరం కావడం కచ్చితంగా షోపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

నిజానికి తొలి సీజన్లో ‘బిగ్ బాస్’ వైపు జనాలు చూడటానికి ముఖ్య కారకుడు ఎన్టీఆర్. అతడి వాక్చాతుర్యం.. పరిజ్ఞానం.. ఆకర్షణ మీద అందరికీ నమ్మకం ఉండి.. బుల్లితెరపై అతడి మేనియా ఎలా ఉంటుందో చూడాలని అందరూ ‘బిగ్ బాస్’పై ఓ కన్నేశారు. అంచనాలకు తగ్గట్లే షోను అద్భుతంగా నడిపించి విజయవంతం చేశాడు తారక్. నాని కూడా తెలివైన వాడే. వాక్చాతుర్యం ఉన్నవాడే. అతడికీ జనాల్లో ఫాలోయింగ్ ఉంది. కానీ ఎన్టీఆర్‌ తో పోలిస్తే షోను ఏ మేరకు రక్తి కట్టిస్తాడన్నది చూడాలి. ఎన్టీఆర్‌ కు ఉన్న భారీ ఫాలోయింగ్ ‘బిగ్ బాస్’కు కలిసొచ్చింది. అతడి కోసమే లక్షల మంది షో చూసేవాళ్లు. నాని అలా ఆకర్షణ మంత్రం వేయగలడా అన్నది సందేహం. రెండో సీజన్ కు ఎన్టీఆర్ లేడనగానే అతడి అభిమానులు నిట్టూర్చేశారు. తమ నిరాసక్తతను ఆల్రెడీ సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో చూపిస్తున్నారు. అదే సమయంలో నానికి స్వాగతం చెబుతూ.. షో మీద ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లూ ఉన్నారు. మరి ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. రెండో సీజన్ ఆరంభ ఎపిసోడ్లకు వచ్చే టీఆర్పీ రేటింగ్ లతోనే షో భవితవ్యం ఏంటన్నది తెలిసిపోతుంది. ఎన్టీఆర్ దూరమైన ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది.. నాని ఏమాత్రం షోను రక్తి కట్టిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. నాని అండ్ కో గత ఏడాది ఉన్న ఆదరణను అలాగే కొనసాగిస్తారా.. లేక పెంచుతారా.. లేదా తగ్గిస్తారా అన్నది చూద్దాం మరి.