Begin typing your search above and press return to search.

ముచ్చటగా లైన్‌ లోకి మూడవది

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:08 AM GMT
ముచ్చటగా లైన్‌ లోకి మూడవది
X
నాచురల్‌ స్టార్‌ నాని గత ఏడాది జెర్సీ వంటి ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ ఏడాది తన 25వ చిత్రంతో రాబోతున్నాడు. ఏ హీరో అయినా 25వ చిత్రం అంటే చాలా పవర్‌ ఫుల్‌ గా ఉండాలి.. హీరోయిజం దుమ్ములేచి పోవాలి అన్నట్లుగా కోరుకుంటారు. కాని నాని తన 25వ చిత్రంలో హీరోగా కాకుండా విలన్‌ గా నటించడం విశేషం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న 'వి' చిత్రంతో నాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఒక వైపు 'వి' చిత్రంలో విలన్‌ గా నటిస్తూనే మరో వైపు 'టచ్‌ జగదీష్‌' చిత్రంలో హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో నటిస్తున్నాడు. చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ముగ్గురు అన్నదమ్ముల మద్య సంబంధంను చూపిస్తూ దర్శకుడు శివ ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు లైన్‌ లో ఉండగానే మూడవ సినిమాకు కూడా నాని ఓకే చెప్పాడు. సమ్మర్‌ లో ఆ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాబతుందట.

ట్యాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్‌ సంక్రిత్యన్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని నానితో సినిమాకు రెడీ అవుతున్నాడు. మరో సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ లైన్‌ ను రెడీ చేసిన రాహుల్‌ దాంతో నానిని ఒప్పించాడట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఆ సినిమాను అతి త్వరలోనే సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట. 'వి' సినిమాను పూర్తి చేసిన వెంటనే రాహుల్‌ దర్శకత్వంలో నాని సినిమా మొదలు కాబోతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది 'వి' మరియు 'టక్‌ జగదీస్‌' లతో పాటు రాహుల్‌ మూవీని కూడా నాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.