Begin typing your search above and press return to search.

పెద్ద సినిమాల వలన ఇంచు భయం కూడా లేదు: నాని

By:  Tupaki Desk   |   15 Dec 2021 2:53 AM GMT
పెద్ద సినిమాల వలన ఇంచు భయం కూడా లేదు: నాని
X
నాని - సాయిపల్లవి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఎం సి ఎ' భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మళ్లీ ఇద్దరూ కలిసి చేసిన సినిమానే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్నరాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ .. "నాకు కల్లు ఇష్టం .. వరంగల్లు ఇష్టం .. మీరంటే చాలా చాలా చాలా ఇష్టం. ముందుగా నేను దయాకర్ రావుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తామనగానే అన్ని ఏర్పాట్లు చూసుకుని సపోర్ట్ చేసినందుకు.

మామూలుగా దర్శకులు .. నిర్మాతలు హీరోల డేట్ల కోసం ఎదురుచూస్తుంటారు. హీరోలందరూ సుమగారి డేట్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇండస్ట్రీలో అందరూ ఒకరి డేట్ల కోసం ఎదురుచూస్తున్నారంటే, ఆ ఒక్కరూ సుమ గారే. అదే మీరు .. అదే నేను .. అదే పల్లవి .. అదే ప్లేస్ .. అంతకుమించి రిజల్ట్ ను ఈ 24న మీరు చూడబోతున్నారు. అప్పట్లో 'ఎంసిఎ' బ్లాక్ బస్టర్ గదా అనే సెంటిమెంట్ తో ఇక్కడికి రాలేదు. ఎందుకో ఈ ప్లేస్ లో ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఒక మంచి సినిమా చేసిన తరువాత మనసంతా గర్వంగా ఉంటుంది .. అది ఇప్పుడు చాలా నిండుగా ఉంది.

ఇంకో వారం రోజుల్లో పెద్ద సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. అయినా ఇంచు భయం కూడా లేదు. ఎందుకంటే చేతిలో ఉన్న సినిమా ఎంత బాగా వచ్చిందో నాకు తెలుసు. అది మీ అందరికి నచ్చుతుందని కూడా తెలుసు. మీరు ఎంతో సంతృప్తికరంగా థియేటర్స్ నుంచి బయటికి వెళతారనే నమ్మకం నాకు ఉంది. సినిమాను చూశాను గనుక గర్వంగా చెబుతున్నాను .. క్రిస్మస్ మాత్రం మనదే. రాహుల్ ఇక్కడి రాలేదు .. మిక్సింగ్ లో చెన్నై లో బిజీగా ఉన్నాడు. తను ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఆయనకి ఉంది.

నిర్మాత వెంకట్ బోయనపల్లిగారు తన పిల్లల గురించి ఎంత ఆలోచిస్తారో .. నా గురించి అంతలా ఆలోచించారు .. నన్ను ఎంతో గారం చేశారు. ఇది ఆరంభం మాత్రమే .. ఇక ముందు ఆయనతో కలిసి మరిన్ని సినిమాలను చేయాలనుకుంటున్నాను. 'జెర్సీ' తరువాత నాతో సానూ చేసిన సినిమా ఇది. ఎంతోమంచి ఫొటోగ్రఫీని అందించారు. ఎడిటర్ నవీన్ నూలికి 'జెర్సీ'కి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాతో మరోసారి అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఆర్టు డైరెక్టర్ అవినాష్ తో పాటు, ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంతమంది ఇంతగా కష్టపడటం వల్లనే, ఇలాంటి ఒక ప్రోడక్ట్ ను మీ ముందుకు తీసుకు రాగలుగుతున్నాము" అంటూ చెప్పుకొచ్చాడు.