Begin typing your search above and press return to search.

నాని చేసిన సాహసానికి రేటు పలకట్లేదా?

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:36 AM GMT
నాని చేసిన సాహసానికి రేటు పలకట్లేదా?
X
90ల్లో వరుసగా సినిమాలు తీసి.. ఆ తర్వాత సినీ రంగానికి దూరమైపోయి.. మధ్యలో ‘మిత్రుడు’ లాంటి డిజాస్టర్ అందించిన నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ‘బందిపోటు’ లాంటి డిజాస్టర్ తో అల్లరి నరేష్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఒకప్పుడు స్టార్ హీరోలతో పని చేసి.. ఈ మధ్య ఎవరికీ పట్టకుండా పోయిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఎవడే సుబ్రమణ్యం.. భలే భలే మగాడివోయ్.. కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్న నాని ఈ ముగ్గురితో కలిసి సినిమా చేయడానికి అంగీకరించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

నాని చేసింది పెద్ద సాహసమే. ఈ సినిమా చేయొద్దంటూ చాలామంది తనను వారించినట్లు నానినే స్వయంగా చెప్పడం విశేషం. ఎంత ఇంద్రగంటి మీద గురు భక్తి ఉన్నా.. ఇంత రిస్క్ వద్దని చాలా మంది అభిప్రాయపడ్డప్పటికీ నాని తగ్గలేదు. ఐతే నాని చేసిన సాహసానికి ఏమాత్రం ఫలితం వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారిప్పుడు. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగానే అనిపించింది. ఐతే నాని తన ఇమేజ్ కు భిన్నంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఏమాత్రం తేడాగా ఉన్నా.. అతడి కెరీర్ కు చాలా ఇబ్బంది ఎదురవుతుంది.

గత రెండు సినిమాలతో నానికి స్టార్ ఇమేజ్ వచ్చింది. అతడు నెక్స్ట్ లెవెల్ కు ఎదగడానికి మంచి పునాది పడింది. ఈ టైంలో ఓ స్టార్ డైరెక్టర్ ఎవరితోనైనా సినిమా చేస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉండేది. భారీ లెవెల్లో బిజినెస్ జరిగేది. సినిమా సక్సెస్ అయితే కలెక్షన్లు అదిరిపోయేవి. ఐతే నాని ఇప్పుడు చేసిన సాహసోపేత సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని సమాచారం. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ కంటే దీనికి తక్కువ ధరలు పలికాయట.

ఆడియో రైట్స్ అయితే మరీ తక్కువకు కట్టబెట్టాల్సి వచ్చిందట. సినిమాకు వివిధ ఏరియాల నుంచి వస్తున్న ఆఫర్లు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఐతే సినిమా మీద మాత్రం నాని సహా అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి.. నాని చేసిన సాహసానికి సరైన ఫలితం దక్కుతుందేమో చూద్దాం.