Begin typing your search above and press return to search.

ఆ వార్తలు బాధించాయన్న నాని

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:09 AM GMT
ఆ వార్తలు బాధించాయన్న నాని
X
టాలీవుడ్లో నేచురల్ స్టార్ నానికి వివాద రహితుడనే పేరుంది. అతడికి సంబంధించి మీడియాలో ఎప్పుడూ నెగెటివ్ న్యూస్ వచ్చింది లేదు. అప్పుడప్పుడూ కొన్ని గాసిప్స్ మాత్రం వస్తుంటాయి. ఈ ఏడాది ఒక హీరోయిన్ తో ఎఫైర్ అంటూ కొంచెం గట్టిగానే ప్రచారం జరిగింది. ఒకే హీరోయిన్ తో వరుసగా రెండేళ్లలో రెండు సినిమాలు చేయడం ఈ రూమర్లకు దారి తీసింది. ఐతే నాని ఆ తర్వాత వేరే సినిమాలోకి వచ్చేయడంతో ఆ రూమర్ల గురించి అందరూ మరిచిపోయారు. ఐతే నాని మాత్రం అప్పటి రూమర్లను ఇంకా గుర్తుంచుకున్నాడు. ఇలాంటి వార్తలు తననెంతగా బాధపెడతాయో మీడియా ముందు చెప్పుకొచ్చాడు నాని.

తన నటన గురించి.. లేదా తన ప్రవర్తన గురించి.. ఇంకేదైనా చెడు ఉంటే దాని గురించి వార్తలు రాయొచ్చని.. వాటి విషయంలో తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని నాని అన్నాడు. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అబద్ధపు వార్తలు వస్తే మాత్రం చాలా బాధపడతానని నాని అన్నాడు. తన గురించి ఇంతకుముందు వచ్చిన ఇలాంటి వార్తలు అలాగే బాధపెట్టాయని నాని చెప్పాడు. సినిమా గాసిప్స్ ఎన్నయినా రాసుకోవచ్చని.. కానీ ఏ ఆధారం లేని రూమర్లను ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదని నాని అన్నాడు. బహుశా ఈ వార్తలు నాని వ్యక్తిగత జీవితంలో ఏదైనా డిస్టబెన్స్ తెచ్చాయేమో అని సందేహిస్తున్నారు. ఇంతకుముందు ‘ఆహా కళ్యాణం’లో తాను లిప్ లాక్ చేసిన సీన్ చూసి తన భార్య ఏడ్చేసిందని.. ఇకపై అలాంటి సీన్లు చేయకూడదని అప్పుడే డిసైడయ్యానని నాని ఇంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే రూమర్లు నానికి ఇబ్బంది తెచ్చిపెట్టాయేమో.