Begin typing your search above and press return to search.

పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు ముందడుగు వేయాలి : నాని

By:  Tupaki Desk   |   30 Aug 2020 5:40 PM IST
పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు ముందడుగు వేయాలి : నాని
X
నేచురల్ స్టార్ నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన మూవీ ''వి''. సుధీర్ బాబు - నివేదా థామస్ - అదితీరావు హైదరీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హర్షిత్‌ రెడ్డిలు నిర్మించారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన 'వి' టీజర్ మరియు ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో సుధీర్ బాబు పోలీసు ఆఫీసర్‌ గా.. నాని సీరియల్‌ కిల్లర్‌ గా కనిపించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో విడుదల కాగా.. 'వి' మూవీ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టనుందని చెప్పవచ్చు.

కాగా 'వి' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నాని ఓ ఇంటర్వ్యూలో మూవీకి సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాని మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ లాక్‌ డౌన్ వలన కుదరలేదని.. అప్పటి నుంచి థియేటర్లు తెరుచుకుంటాయని ఎదురుచూశామని.. ఐదు నెలలు అవుతున్నా థియేటర్స్ తెరుచుకోలేదని చెప్పుకొచ్చాడు. ''ఇలాంటి సమయంలో పరిస్థితులకు అనుగుణంగా ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. కాబట్టి మేము ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాం. ఎంతైనా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు.. కానీ మార్పు కోరుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు దాన్ని మొదలుపెట్టాలి. ఈ మార్పును మేము తీసుకొస్తున్నాం'' అని నాని చెప్పారు. మరి 'వి' సినిమా విడుదలైన తర్వాత మరిన్ని సినిమాలు ఓటీటీ బాట పడతాయేమో చూడాలి.