Begin typing your search above and press return to search.

తన కూతురుని అభిమాని ఇంటికి కోడలిగా పంపిన సిరివెన్నెల!

By:  Tupaki Desk   |   1 Dec 2021 7:49 AM GMT
తన కూతురుని అభిమాని ఇంటికి కోడలిగా పంపిన సిరివెన్నెల!
X
'జగమంత కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది', 'తరలిరాదా తనే వసంతం .. తన దరికి రాని వనాల కోసం' అనే రెండు పంక్తులు చాలు, సిరివెన్నెల సాహిత్యపు లోతుల కొలవడానికి. శ్రీశ్రీ పదాల్లోని పదును .. సినారే కవిత్వంలోని సొగసులు సిరివెన్నెల పాటల్లో కనిపించేవి. ఆత్రేయ పాటల్లోని ఆర్ద్రత .. వేటూరి పాటల్లోని కొంటె పద బంధాలు సిరివెన్నెల కలం గొంతుకలో వినిపించేవి. ఆయన కలం స్పర్శించని తెల్ల కాగితం తెల్లబోయింది. ఆయన చేతి స్పర్శ తగలని పెన్ను చిన్నబోయింది. ఆయన మరణంతో తెలుగు పాట మూగబోయింది.

సాహిత్యంతో పరిచయమున్నవారు సిరివెన్నెలకి అభిమానులు కాకుండా .. ఆప్తులు కాకుండా ఉండలేరు. ఆయనతో కాసేపు మాట్లాడితే గ్రంథాలయానికి వెళ్లవలసిన అవసరం లేదనుకునేవారు చాలామందినే ఉన్నారు. ఆయన పలకరిస్తే చాలు .. పరిచయం కలిగితే చాలు అనుకునేవారు ఎంతోమంది. పాట రాయడమంటే ఆయన దృష్టిలో ఒక తపస్సు .. పాట రాయడమంటే ఆయన దృష్టిలో ఒక యజ్ఞం చేయడం. ఆ పనిని ఆయన చాలా సిన్సియర్ గా చేసేవారు. తాను రాసిన పాటలను ఆయన గుర్తుచేసుకునేవారే తప్ప, గొప్పలు ఎప్పుడూ చెప్పుకోలేదు.

ఎప్పుడు ఎక్కడా చూసినా సిరివెన్నెల చాలా సింపుల్ గా కనిపించేవారు. ఆయన భావాలు కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేవి. తన కూతురును తన అభిమాని ఇంటికి కోడలిగా పంపించినవారాయన. ఆ అభిమాని ఎవరో కాదు, విశాఖకు చెందిన నండూరి రామకృష్ణ. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "నేను సిరివెన్నెలగారి అభిమానిని .. కొన్ని సాహితీ సమావేశాల్లో ఆయనతో కలిసి వేదిక పంచుకున్నాను. 1995 నుంచి మా మధ్య స్నేహం పెరుగుతూ వెళ్లింది. 2001లో ఆయన మా అబ్బాయి సాయిప్రసాద్ 'ఒడుగు' ఫంక్షన్ కి వైజాగ్ వచ్చారు.

ఆ వేడుక జరుగుతూ ఉండగానే .. మా అబ్బాయికి తన కూతురు లలితాదేవిని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు. ఆ తరువాత తన మనసులోని మాటను నాకు చెప్పారు. ఆయనతో బంధుత్వం కలుపుకోవడానికంటే అదృష్టం ఏముంటుంది? అలా అప్పటివరకూ ఆయన అభిమానినైన నేను, ఆ తరువాత వియ్యంకుడిని అయ్యాను. సిరివెన్నెల మొదటి నుంచి కూడా విలువలు కలిగిఉన్న సాహిత్యాన్ని సమాజానికి అందించారు. ఆయన మరణం మా కుటుంబానికి మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా తీరని లోటు" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.