Begin typing your search above and press return to search.

కొత్తమ్మాయి చితగ్గొట్టేసిందిగా..

By:  Tupaki Desk   |   19 Nov 2016 5:30 PM GMT
కొత్తమ్మాయి చితగ్గొట్టేసిందిగా..
X
నందిత శ్వేత.. నిన్నట్నుంచి తెలుగు పరిశ్రమలో.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు గురించే చర్చ నడుస్తోంది. శుక్రవారం విడుదలైన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఈ అమ్మాయి పెర్ఫామెన్స్ మామూలుగా లేదు. సినిమాలో ఆమె పాత్ర మొదలయ్యే సరికి సగం సినిమా అయిపోతుంది. కానీ మిగతా అర్ధభాగంలోనే తనదైన ముద్ర వేసింది నందిత.

ఇక్కడ చాలామంది హీరోయిన్లుండగా.. దర్శకుడు వీఐ ఆనంద్ ఏరి కోరి కోలీవుడ్ నుంచి నందితను ఎందుకు పట్టుకొచ్చాడని అంతా అనుకున్నారు. అందులోనూ లుక్స్ పరంగా చూస్తే నందిత అంత గొప్పగా ఏమీ అనిపించదు. మామూలు అమ్మాయి లాగా ఉంటుంది. మరి ఏంటి ఈమె ప్రత్యేకత అని సందేహించిన వాళ్లందరికీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆమె పెర్ఫామెన్సే సమాధానం.

దయ్యం పట్టిన అమ్మాయిగా తొలి సన్నివేశంలో ఆమెను చూసినపుడే ఒక రకమైన కలకలం రేగుతుంది. ఫస్ట్ సీన్లో ఆమె ఇచ్చే హావభావాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఆ తర్వాతి సన్నివేశాల్లోనూ నందిత తనదైన ముద్ర వేసింది. ద్వితీయార్ధాన్ని నిలబెట్టింది ప్రధానంగా నందితే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. హెబ్బా పటేల్ తన గ్లామర్ షోతో అప్పటిదాకా ఎంతగా హైలైట్ అయినా.. ఆమె సినిమా అంతటా కనిపించినా.. నందిత తక్కువ స్క్రీన్ టైంతోనే ప్రేక్షకుల మనసులపై బలమైన ముద్ర వేసింది.

‘కబాలి’ డైరెక్టర్ రంజిత్ తొలి సినిమా ‘అట్టకత్తి’తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన నందిత.. తొలి సినిమాతోనే తన ప్రత్యేకత చాటుకుంది. ఆ తర్వాత శివ కార్తికేయన్ కథానాయకుడిగా పరిచయమైన ‘ఎదిర్ నీచిల్’ సినిమాలో కీలక పాత్ర చేసింది. పురుష హార్మోన్లు ఉన్నాయన్న కారణంతో నిషేధానికి గురైన తమిళనాడు స్ప్రింటర్ శాంతి సౌందర్ రాజన్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన పాత్రలో ఆమె నటించింది ఆ సినిమాలో. ఈ రెండూ నందితకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్లో చాలా వరకు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేసిన నందిత.. ఇప్పుడు తెలుగులోనూ తన తొలి సినిమాలోనే తన ప్రత్యేకత చాటుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/