Begin typing your search above and press return to search.

నందితపై క‌ళ్లు ప‌డుతున్నాయి

By:  Tupaki Desk   |   20 Nov 2016 7:30 PM GMT
నందితపై క‌ళ్లు ప‌డుతున్నాయి
X
టాలీవుడ్‌ లో ఎప్పుడు ఏ హీరోయిన్ మెరుస్తుందో అర్థం కాని ప‌రిస్థితి. ఇదివ‌ర‌కైతే అందంలోనైనా, న‌ట‌న విష‌యంలోనైనా సీనియ‌ర్ హీరోయిన్ల‌దే హ‌డావుడి ఉండేది. ఎక్కువ‌గా వాళ్ల గురించి మాత్ర‌మే మాట్లాడుకొనేవాళ్లం. కానీ ఇప్పుడు కొత్త‌మ్మాయిలు కూడా జోరు చూపిస్తున్నారు. అందంలోనూ - న‌ట‌న‌లో అద‌ర‌గొడుతూ తామూ ఎవ్వ‌రికీ తీసిపోమ‌ని నిరూపిస్తున్నారు. దాంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప‌ని మ‌రింత సులువైపోతోంది. కొత్త‌మ్మాయిలైనా సరే ధైర్యంగా ఎంపిక చేసేసుకోవ‌చ్చనే భ‌రోసాతో ఉన్నారు. ఆ త‌ర‌హా భ‌రోసాని మ‌రో క‌థానాయిక కూడా ఇస్తోంది. ఆ క‌థానాయిక ఎవ‌రో కాదు... నందిత శ్వేత‌.

ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాలో ఓ క‌థానాయిక‌గా న‌టించింది నందిత‌. అటు అందంతోనూ, ఇటు న‌ట‌న‌తోనూ ఆమె ఔరా అనిపించింది. నివేదా థామ‌స్‌ - మంజిమ మోహ‌న్ త‌దిత‌ర కొత్త భామ‌ల గురించి మాట్లాడుకొంటున్న ద‌శ‌లోనే ఆ జాబితాలో తానూ ఉన్నాన‌ని చెప్పింది నందిత శ్వేత‌. త‌మిళంలో ఇప్ప‌టికే ఓ మార్క్ వేసిన నందిత శ్వేత బెంగుళూరు అమ్మాయి. ఆమె ఎక్క‌డికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని తెలిసినా ఆమె గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌రో హీరోయిన్ హెబ్బా ఉండ‌టంతో అంద‌రి క‌ళ్లూ ఆమెపైనే ప‌డ్డాయి. అయితే సినిమాలో మాత్రం నందితనే సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యింది. హెబ్బాని మించిపోయి న‌టించింది. అందంతోనే కాకుండా, న‌ట‌న‌లోనూ దుమ్ము దులిపేసింది. న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్ని చేయ‌డానికి మ‌రో క‌థానాయిక దొరికింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు సంబ‌ర‌ప‌డుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/