Begin typing your search above and press return to search.

భార్యలు.. భర్త బయోపిక్ తీస్తారట

By:  Tupaki Desk   |   9 Sept 2017 6:05 AM
భార్యలు.. భర్త బయోపిక్  తీస్తారట
X
ఎన్నో ఊహించని మలుపులు ప్రతి ఒక్క మనిషికి ఎదురవుతాయి. ఎంతో మంది మహానుభావులు వారి చివరి క్షణాలను ఒక పుస్తకంలో పొందుపరిస్తే వాటిని ప్రస్తుత రోజుల్లో బయోపిక్ అంటూ సినిమా ద్వారా తెరకెక్కించేందుకు ఫిలింమేకర్లు ప్రయత్నిస్తున్నారు. చాలా వరకు ఆ బయోపిక్ లు ఒకే కోణంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని అందులో ఉండే కొన్ని తప్పటడుగులు కరెక్ట్ గా చూపించడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నారనే చెప్పాలి.

అయితే ఇప్పుడు ఒక సీనియర్ నటుడి జీవితం ఉన్నది ఉన్నట్టుగా తియ్యడానికి రెడీ అయిపోతున్నారట ఇద్దరు సతీమణులు. వారు ఎవరో కాదు బాలీవుడ్ లో తన నటనతో ప్రత్యేక ఖ్యాతిని దక్కించుకున్న ఓంపూరి. అయన ఈ ఏడాది మొదటి నెలలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఓంపూరి వెండి తెరపై విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త కష్టాలను అనుభవించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆయన వివాహమాడిన ఇద్దరు భార్యలు వివాదంతో ఆయన నుంచి విడిపోవడం ఓంపూరి జీవితంలో ఓ కీలక మలుపు. అయితే ఆయన జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తాను అంటోంది మొదటి భార్య సీమా కపూర్. ఇక రెండవ భార్య నందిత కూడా ఓంపురి జీవితాన్ని తెరకెక్కిస్తాను అంటోంది.

అయితే నందిత మాత్రం తాను రాసుకున్న ‘అన్‌ లైక్లీ హీరో' అనే పుస్తకం ఆధారంగానే సినిమా తీస్తాను అంటోంది. అప్పట్లో అమ్మడు ఈ పుస్తకావిష్కరణ చేస్తాను అంటే ఓంపురి అడ్డుకున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆయన గురించి కొన్ని వివాదాస్పద విషయాల్ని పేర్కొనడం ఆయనకు నచ్చలేదు. మరి ఇప్పుడేమో ఏకంగా సినిమానే తీస్తాను అంటోంది. ఇక భర్త చనిపోయి ఏడాది కూడా అవ్వకముందే సతీమణులు ఇద్దరు మీడియాకెక్కి నేనే సినిమా తీస్తాను అని చెప్పడం బాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.