Begin typing your search above and press return to search.

బాలయ్య కొడుకు కోసం క్యారెక్టర్ రెడీ

By:  Tupaki Desk   |   7 Jan 2016 1:59 PM GMT
బాలయ్య కొడుకు కోసం క్యారెక్టర్ రెడీ
X
గత ఏడాది అక్కినేని కుటుంబం నుంచి కథానాయకుడిగా పరిచయమైన అఖిల్ విషయంలో చాలా హడావుడి కనిపించిందింది. అఖిల్ తర్వాత టాలీవుడ్ అంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నది నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్న విషయంలోనే. అతడి ఎంట్రీ 2017లో ఉండొచ్చని బాలయ్య గతంలోనే ప్రకటించాడు. ఇప్పటికే 2016లోకి వచ్చేశాం కాబట్టి.. ఇంకో ఏడాదిలో నందమూరి బుల్లోడిని తెరమీద చూడబోతున్నామన్నమాట. వచ్చే ఏడాది ఎంట్రీ అంటే సన్నాహాలు ఇప్పుడే మొదలెట్టేయాలి కదా. మరి మోక్షజ్న ఎంట్రీ ఎలా ఉండబోతోంది? అతను ఎలాంటి సినిమా చేస్తాడు? అన్న ఆసక్తి నందమూరి అభిమానుల్లో ఇప్పటికే మొదలైపోయింది.

ఐతే మోక్షజ్న అరంగేట్రం గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య తన వందో సినిమాగా కానీ లేదంటే ఆ తర్వాత కానీ.. ఆదిత్య 369 సీక్వెల్ ‘ఆదిత్య 999’లో నటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి స్క్రిప్టు కూడా తన దగ్గర సిద్ధంగా ఉందని సింగీతం శ్రీనివాసరావు ఇంతకుముందే ప్రకటించారు. బాలయ్య ఈ ప్రాజెక్టు విషయంలో చాలా పట్టుదలగానే ఉన్నాడట. ఆ సినిమాలో యువరాజు పాత్రలో మోక్షజ్నను నటింపజేసే ఉద్దేశం కూడా ఉందట బాలయ్యకు. హీరోగా మరో సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా సరే.. ఈ చిత్రంలో యువరాజు పాత్రను మాత్రం మోక్షజ్నతో చేయించాలన్నది బాలయ్య ఆలోచన అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాలి.