Begin typing your search above and press return to search.

నందమూరి హీరోలు పైచేయి సాధించినట్లేనా..?

By:  Tupaki Desk   |   6 Aug 2022 7:38 AM GMT
నందమూరి హీరోలు పైచేయి సాధించినట్లేనా..?
X
కరోనా పాండమిక్ తర్వాత ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఓటీటీలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకుల అభిరుచిలోనూ చాలా మార్పులు వచ్చాయి. అసలు జనాలు ఎలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు.. ఎలాంటి కంటెంట్ ను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నందమూరి హీరోల కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగిందని చెప్పాలి.

నటసింహం నందమూరి బాలకృష్ణ గతేడాడి చివర్లో 'అఖండ' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఫస్ట్ పెద్ద సినిమా ఇదే. వైరస్ భయంతో జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే ఆలోచనతో మేకర్స్ తమ చిత్రాలను రిలీజ్ చేసుకోడానికి వెనుకంజ వేస్తున్న టైంలో.. బాలయ్య ధైర్యంగా తన సినిమాని విడుదల చేసి ఘనవిజయం సాధించారు. తక్కువ టికెట్ రేట్లు - యాభై శాతం ఆక్యుపెన్సీతోనూ భారీ వసూళ్ళు సాధించి.. ఇండస్ట్రీకి నూతనోత్సాహం తీసుకొచ్చారు. తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ కు ఊపు తీసుకొచ్చింది.

ఐదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి.. బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. కొమురం భీమ్ గా తారక్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గోబల్ ఆడియన్స్ ప్రశంసలను పొందాడు. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు లేటెస్టుగా నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాతో ప్రశంసలు అందుకుంటున్నారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సోసియో ఫాంటసీ చిత్రం తొలి రోజే హిట్ టాక్ రాబట్టింది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలబడుతున్న నేపథ్యంలో.. 'బింబిసార' మూవీ విజయం ఇప్పుడు ఇండస్ట్రీలో జోష్ నింపింది.

ఇలా నందమూరి హీరోలు ముగ్గురూ పాండమిక్ తర్వాత మంచి విజయాలు సాధించారు. అదే సమయంలో మిగతా ఫ్యామిలీ హీరోలు సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయడంతో తడబడ్డారు. మెగా ఫ్యామిలీ విషయానికొస్తే.. రామ్ చరణ్ RRR సినిమాతో సక్సెస్ అందుకున్నాడని సంబరపడే లోపే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాతో డిజాస్టర్ చవిచూశారు.

పవన్ కళ్యాణ్ పాండమిక్ టైమ్ లో రిలీజ్ చేసిన 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోలేకపోయాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' తో పర్వాలేదనిపించినా.. 'గని' సినిమాతో భారీ ప్లాప్ అందుకున్నాడు. 'ఉప్పెన' లా వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. 'కొండపొలం' తో నిరాశ పరిచాడు. 'రిపబ్లిక్' తో సాయి తేజ్ కూడా పరాజయం పాలయ్యాడు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా పాండమిక్ తర్వాత హిట్లు అందుకున్నారు కానీ.. అవి నందమూరి హీరోల రేంజ్ విజయాలైతే కాదు. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' - నాగచైతన్య 'లవ్ స్టొరీ' సినిమాలు సక్సెస్ అయ్యాయి. అక్కినేని తండ్రీకొడుకులు కలిసి చేసిన 'బంగార్రాజు' హిట్టవ్వగా.. ఇటీవల 'థాంక్యు' మూవీ చై కెరీర్ లో అతి పెద్ద ప్లాప్ గా నిలిచింది.

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా 'అరణ్య' 'విరాటపర్వం' చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. అలానే విక్టరీ వెంకటేశ్ నటించిన 'నారప్ప' 'దృశ్యం 2' సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. ఇటీవల వచ్చిన 'ఎఫ్ 3' ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. ఇలా మిగతా కుటుంబాలతో కంపేర్ చేసి చూస్తే.. నందమూరి హీరోలు పాండమిక్ తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ అయ్యారని అనుకోవచ్చు.

ఇప్పటికే నందమూరి అభిమానులు మిగతా హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేయడాన్ని మనం గమనించవచ్చు. 'బింబిసార' సినిమా విజయం తర్వాత వారిలో కొందరు 'మెగాస్టార్ కళ్యాణ్ రామ్' & 'పవర్ స్టార్ కళ్యాణ్ రామ్' అంటూ మెగా ఫ్యాన్స్ ను ట్రోల్ చేస్తూ హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. నందమూరి హీరోలు ఈ సక్సెస్ ట్రాక్ ని కొనసాగించి టాలీవుడ్ లో అగ్రస్థానంలో నిలుస్తారని కామెంట్స్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.