Begin typing your search above and press return to search.

నంద‌మూరి అభిమానుల ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   29 Aug 2018 6:49 AM GMT
నంద‌మూరి అభిమానుల ఆవేద‌న‌
X
రోడ్డు ప్ర‌మాదానికి ఒక ప్ర‌ముఖ కుటుంబం అదే ప‌నిగా గురి కావ‌టం.. దారుణ‌మైన విషాదాలు నంద‌మూరి హ‌రికృష్ణ ఫ్యామిలీని వెంటాడుతున్న‌ట్లుగా క‌నిపిస్తాయి. నాలుగేళ్లకు ఒక‌సారి అన్న‌ట్లుగా.. హ‌రికృష్ణ కుటుంబంలో రోడ్డు ప్ర‌మాదాలు వ‌రుస‌గా వెంటాడ‌టం క‌నిపిస్తుంది.

ఈ కార‌ణంతోనే తాము చేసే సినిమాల్లో హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యులు త‌మ సినిమా ఆరంభంలోనే రోడ్డు ప్ర‌మాదంలో త‌మ కుటుంబ స‌భ్యుడ్ని కోల్పోయామ‌ని.. త‌మ‌కు ఎదురైన విషాదం మ‌రే కుటుంబానికి ఎదురుకావొద్ద‌న్న వేడుకోలు క‌నిపిస్తుంటుంది. అంద‌రి మేలు కోరుతూ.. అంద‌రి కుటుంబాలు క్షేమంగా ఉండాల‌ని కోరుకునే హ‌రికృష్ణ ఫ్యామిలీకే రోడ్డు ప్ర‌మాదాలు శాపంగా మార‌టం తెలుగువారిని జీర్ణించుకోలేకుండా చేస్తోంది.

2009లో నంద‌మూరి హ‌రికృష్ణ కుటుంబానికి తొలి రోడ్డు ప్ర‌మాదం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసే క్ర‌మంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఖ‌మ్మం లో ప్ర‌చారం పూర్తి చేసుకొని హైద‌రాబాద్ రిట‌ర్న్ జ‌ర్నీ అయ్యారు. ఆ స‌మ‌యంలో న‌ల్గొండ జిల్లాలోని చివ్వెంల మండ‌లం ద‌గ్గ‌ర మోతే వ‌ద్ద ఆయ‌న న‌డుపుతున్న కారు బోల్తా ప‌డి.. ప్ర‌మాదానికి గుర‌య్యారు. స్వ‌ల్ప గాయాల‌తో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఇది జ‌రిగిన నాలుగేళ్ల త‌ర్వాత (స‌రిగ్గా చెప్పాలంటే ఐదేళ్లకు కాస్త అటూఇటూగా) హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు వెళ్లే స‌మ‌యంలో న‌ల్గొండ జిల్లా మున‌గాల మండ‌లం ఆకుల‌పాముల వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న మ‌ర‌ణించారు. రాంగ్ రూట్లో వ‌స్తున్న ట్రాక్ట‌ర్ ను త‌ప్పించ‌బోయి ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హ‌రికృష్ణ సైతం రోడ్డు ప్ర‌మాదంలోనే ప్రాణాల్ని విడిచారు.

నెల్లూరు జిల్లా కావ‌లిలో జ‌రిగే ఒక వేడుక‌కు హాజ‌ర‌య్యేందుకు హైద‌రాబాద్ నుంచి హ‌రికృష్ణ బ‌య‌లుదేరారు. తానే స్వ‌యంగా కారు డ్రైవ్ చేస్తున్నారు. అతి వేగంగా దూసుకెళ్లిన హ‌రికృష్ణ వాహ‌నం ముందుగా వెళుతున్న వాహ‌నాన్ని ఢీ కొట్టి.. కారులో నుంచి ఎగిరి 30 అడుగుల దూరంలో కింద ప‌డ్డారు. ఈ ప్ర‌మాదం కూడా న‌ల్గొండ‌లోనే జ‌రిగింది. ఈ మూడు ప్ర‌మాదాల్లోనూ హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యులు ప్ర‌యాణిస్తున్న కార్లు అమిత వేగంతో ఉండ‌టం గ‌మ‌నార్హం.