Begin typing your search above and press return to search.

నందమూరి కాంపౌండ్ వీక్ అయిపోయిందే

By:  Tupaki Desk   |   29 Jan 2020 5:18 AM GMT
నందమూరి కాంపౌండ్ వీక్ అయిపోయిందే
X
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ సినిమా కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు నందమూరి కుటుంబంలో మూడవ తరం కొనసాగుతోందంటేనే మనం నందమూరి ఫ్యామిలీ లెగసీని అర్థం చేసుకోవచ్చు. లెజెండరీ ఎన్టీఆర్ తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఒక స్టార్ హీరోగానే కాకుండా నిర్మాతగా.. దర్శకుడిగా అయన ఘన విజయాలు సాధించారు. బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు.

ఎన్టీఆర్ కు వారసుడిగా రంగప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ మునుపటి తరంలో స్టార్ హీరోగా తన సత్తా చాటారు. భారీ మాస్ ఫాలోయింగ్ తో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నారు. సినిమాల్లో బాలయ్య టచ్ చెయ్యని జోనర్ దాదాపుగా లేదు. అయితే బాలయ్యకు ఈమధ్య విజయాలు లభించడం లేదు. ఈ తరం ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలు చేయలేకపోతున్నారు. వరస ఫెయిల్యూర్లతో సతమతమవుతున్నారు. బాలయ్య కెరీర్ చివరి దశకు వచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది. వయసు కూడా మీద పడుతూ ఉండడంతో ఎక్కువ కాలం హీరోగా కొనసాగడం కష్టమేనని అంటున్నారు. నిర్మాతగా చూస్తే మాత్రం బాలయ్యకు కలిసిరాలేదు.

ఈ తరం నందమూరి వారసుల విషయం తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరిగా తన సత్తా చాటుతున్నారు. నందమూరి కుటుంబం లెగసీని ముందుకు తీసుకుపోగల స్థాయి తారక్ కు ఉందనేది అందరూ అంగీకరించే విషయం. అయితే తారక్ తప్ప ఈ జెనరేషన్లో మరో సక్సెస్ ఫుల్ హీరో నందమూరి ఫ్యామిలీలో లేరు. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆయనకు పెద్దగా విజయాలు లభించడం లేదు. ఆయన కెరీర్ పయనం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరోల స్థాయిని దాటలేకుండా ఉన్నారు. ఎక్కువకాలం కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగే పరిస్థితి లేదని.. రెండేళ్లలో నిర్మాతగా స్థిరపడవచ్చని కూడా ఒక టాక్ ఉంది.

ఇక నందమూరి కుటుంబంలో ఇతర హీరోల గురించి మాట్లాడుకుంటే తారకరత్నకు విజయాలు దక్కకపోవడంతో ఇప్పుడు అవకాశాలు లేవు. ఇక నందమూరి కుటుంబానికి బంధువులు అయిన నారా రోహిత్ విభిన్న కథాంశాలతో ఈ తరం ప్రేక్షకులను మెప్పించినా.. ఈమధ్య పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యారు.

ఒకవైపు మెగా ఫ్యామిలీలో మాత్రం అటు హీరోలు.. ఇటు నిర్మాతల హవా జోరుగా ఉంది. దాదాపుగా మెగా ఫ్యామిలీ వారు ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కానీ నందమూరి కుటుంబానికి వచ్చేసరికి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ తప్ప మిగతా అంతా నీరసంగా ఉందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ప్రముఖ సినీ కుటుంబంలో హీరోలు ఇలా ఉండడం అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.