Begin typing your search above and press return to search.

మేము ఫేక్ హీరోలం... వాళ్లు రియ‌ల్ హీరోస్‌!

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:19 PM GMT
మేము ఫేక్ హీరోలం... వాళ్లు రియ‌ల్ హీరోస్‌!
X
భార‌త్-పాక్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న తరుణంలో బాలీవుడ్ మీద ఈ ప్ర‌కంప‌న‌ల ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కొంత‌మంది పాక్ న‌టీన‌టుల‌పైనా, సాంకేతిక నిపుణుల‌పైనా నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ‌హిష్క‌రణ‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఈ బ‌హిష్క‌ర‌ణ నిర్ణయాన్ని చాలామంది స‌మ‌ర్థిస్తుంటే... కొంత‌మంది వ్య‌తిరేకిస్తున్నారు. ఇదే అంశ‌మై స‌ల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. పాక్ న‌టీన‌టులూ నిపుణులూ ఉగ్ర‌వాదులు కారుక‌దా.. వారంతా క‌ళాకారులే క‌దా అంటూ స‌ల్మాన్ అన్నాడు. దీంతో సోష‌ల్ మీడియాలో స‌ల్మాన్ కామెంట్ల‌పై ర‌చ్చ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశ‌మై స్పందించారు సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్‌. ప‌రోక్షంగా స‌ల్మాన్ వ్యాఖ్య‌ల్ని ఖండించాడు.

దేశ ప్ర‌యోజ‌న విష‌యానికి వ‌చ్చేస‌రికి క‌ళాకారులు చాలా చిన్న‌వాళ్లే అవుతార‌న్నారు. ‘ముందు దేశం... త‌రువాతే క‌ళ.. అందుకు బాలీవుడ్ మిన‌హాయింపు’ అని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. నిజ‌మైన హీరోలంటే వీర జ‌వాన్ల‌నీ, వారు స‌రిహ‌ద్దులో ప్రాణాల‌కు తెగించి పోరాటాలు చేస్తున్నారు అన్నాడు. సినిమాల్లో హీరో ఇజమ్ ఫేక్ అని నానా నిష్క‌ర్ష‌గా చెప్పాడు. సినిమావాళ్లు ఏదో య‌థాలాపంగా మాట్లాడేస్తూ ఉంటార‌నీ వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని నానా స్ప‌ష్టం చేశాడు. బాలీవుడ్ తీసుకునే నిర్ణ‌యాల‌ను వ్య‌క్తిగ‌త అభిప్రాయాలుగా ప‌రిగ‌ణించ‌వ‌ద్ద‌న్నాడు. ఇక‌, త‌న విష‌యానికి వ‌స్తే ముందుగా ఒక బాధ్య‌త‌గ‌ల పౌరుడిగా స్పందిస్తాన‌నీ, ఆ త‌రువాత దేశ‌భ‌క్తుడిన‌నీ, ఆపైనే ఒక న‌టుడిగా ఆలోచిస్తాన‌ని ప‌రోక్షంగా సల్మాన్ పై కౌంట‌ర్ వేశాడు. స‌ల్మాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కామెంట్ల యుద్ధానికి తెర తీసిన నేప‌థ్యంలో నానా చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.