Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం బ్ర‌ద‌ర్ ర‌మేష్ బాబుని దించుతున్నారా?

By:  Tupaki Desk   |   30 Aug 2021 11:30 PM GMT
మ‌హేష్ కోసం బ్ర‌ద‌ర్ ర‌మేష్ బాబుని దించుతున్నారా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కెరీర్ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ.. స్టార్ డ‌మ్ వెనుక ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త కీల‌క పాత్ర పోషించార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌థ‌నాలు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. హీరోగా కెరీర్ ఆరంభంలోనే మ‌హేష్ న‌మ్ర‌త‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డంతో అత‌డికి అన్నిటా తానే అయ్యి న‌మ్ర‌త వ్య‌వ‌హ‌రించాని మీడియా క‌థ‌నాలొచ్చాయి. కొన్ని సంద‌ర్భాల్లో మ‌హేష్ సైతం త‌న స‌క్సెస్ వెనుక న‌మ్ర‌త ఫార్ములా ఉంద‌ని బాహాటంగానే చెప్పిన సంద‌ర్భాలున్నాయి. ఆ త‌ర్వాతి కాలంలో మ‌హేష్ సూప‌ర్ స్టార్ గా ఎదిగేసాక‌ ఫుల్ బిజీ అవ్వ‌డంతో వ్యాపారాలు.. ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించిన అన్ని విష‌యాలు న‌మ్ర‌త చూసుకునేవార‌ని... అందుకు స‌హాయ‌కులుగా మెహ‌ర్ ర‌మేష్ వ్య‌వ‌రిస్తుంటార‌ని ఫిలిం మీడియాలో టాక్ ఉంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త మామ‌గారు.. సూప‌ర్ స్టార్ కృష్ణ వీట‌న్నింటిని కొట్టిపారేసారు. న‌మ్ర‌త కేవ‌లం ఇంటికే ప‌రిమిత‌మ‌ని.. మ‌హేష్ కి సంబంధించిన ఏ విష‌యంలోనూ క‌ల్పించుకోర‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసారు. న‌మ్ర‌త ప్ర‌పంచ‌మంతా ఇల్లు మాత్ర‌మేన‌ని.. పిల్ల‌ల్ని చూసుకోవ‌డానికే ఆమెకు స‌మయం అంతా స‌రిపోతుంద‌న్నారు. తమ కుటుంబంలో క‌లిసిపోతుందని...న‌మ్ర‌త‌ని కూమార్తెతో సమానాంగా చూస్తామ‌ని కృష్ణ తెలిపారు. అలాగే త‌న కుమార్తెల‌తోనూ చాలా క్లోజ్ గా ఉంటుంద‌ని.. అంతా ఒకే ఫ్యామిలీలా ఉంటార‌ని అన్నారు.

ఆ విష‌యంలో న‌మ్ర‌త‌ని చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంద‌ని.. బ‌య‌ట నుంచి వ‌చ్చిన అమ్మాయిలు దూరంగా ఉంటారు. కానీ న‌మ్ర‌త‌లో అలాంటిది ఎక్క‌డా క‌నిపించ‌ద‌ని కృష్ణ అన్నారు. అలాగే పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు న‌టుడిగా ఎందుకు ఫెయిల‌య్యారు! అన్న విష‌యాన్ని కూడా రివీల్ చేసారు. ర‌మేష్ కెరీర్ ఆరంభంలో స‌రైన స‌బ్జెక్ట్ లు ఎంచుకోలేక‌పోయాడు. అందుకే అత‌ను న‌టుడిగా రాణించ‌లేక‌పోయాడు. నిర్మాత‌గా మాత్రం సినిమాలు చేస్తాడు. ర‌మేష్ రెడీ అంటే మ‌హేష్ సినిమా చేయ‌డానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు.. అని కృష్ణ అన్నారు. సూప‌ర్ స్టార్ తాజా ప్ర‌క‌ట‌న చూస్తుంటే చాలా కాలంగా సినీనిర్మాణానికి దూరంగా ఉన్న‌ ర‌మేష్ బాబు తిరిగి నిర్మాత‌గా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతున్నారనే హింట్ అందింది. జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పేరుతో మ‌హేష్ ఇప్ప‌టికే భాగ‌స్వామిగా ప‌లు బ్యాన‌ర్ల‌తో క‌లిసి సినిమాలు తీస్తున్నారు. మునుముందు ప్ర‌భాస్ .. క‌ళ్యాణ్ రామ్ త‌ర‌హాలోనే సోద‌రుల‌ను క‌లుపుకుని మ‌హేష్‌ సినిమాలు తీస్తారేమో చూడాలి.

న‌టుడిగా నిర్మాత‌గా ర‌మేష్ బాబు జ‌ర్నీ:

ఘట్టమనేని రమేష్ బాబు (జననం 13 అక్టోబర్ 1965) ఆరంభం తండ్రి కృష్ణ ప్రోత్సాహంతో క‌థానాయ‌కుడిగా న‌టించారు. ఆ త‌ర్వాత‌ నిర్మాతగానూ కొన‌సాగారు. రమేష్ బాబు 1974 లో అల్లూరి సీతారామ రాజు చిత్రంతో తెరపైకి వచ్చారు. 1997 లో నటన నుండి రిటైర్ అయ్యే ముందు అతను 15 కి పైగా చిత్రాలలో నటించాడు. 2004 లో నిర్మాతగా మారి కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యాన‌ర్ ని స్థాపించారు. అతని తండ్రి పేరు మీద నిర్మాణ సంస్థను స్థాపించి అతను అర్జున్ - అతిథి చిత్రాలను నిర్మించాడు. ఈ రెండిట్లో అతని సోదరుడు మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించారు. 2011 లో విజయవంతమైన దూకుడు చిత్రానికి సమర్పకుడిగా పనిచేశాడు.

1977లో రమేష్ బాబు తన 12 వ ఏట కృష్ణ‌ చిత్రం `మనుషులు చేసిన దొంగలు`తో బాల నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించారు. రెండు సంవత్సరాల తరువాత 14 సంవత్సరాల వయస్సులో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన `నీడ` చిత్రంలో అతను కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో అతని నాలుగేళ్ల సోదరుడు మహేష్ బాబు కూడా ఒక చిన్న పాత్రలో నటించారు. ఆ తరువాత అతను నటన నుండి కొంత విరామం తీసుకున్నాడు. 1987 లో వి. మధుసూధన్ రావు దర్శకత్వం వహించిన సామ్రాట్ చిత్రంతో క‌థానాయ‌కుడిగా తిరిగి రంగ ప్ర‌వేశం చేశాడు. ఈ చిత్రంలో రమేష్ .. శారదతో పాటు సోనమ్ కీలక పాత్రలో నటించారు. 1988 లో అతను జంధ్యాల చిన్ని కృష్ణుడు.. ఎ. కోదండరామి రెడ్డి `బజార్ రౌడీ`.. అతని తండ్రి దర్శకత్వం వహించిన కలియుగ కర్ణుడు.. ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలలో కనిపించాడు. ముగ్గురు కొడుకులు చిత్రంలో ర‌మేష్ బాబుతో పాటు కృష్ణ‌-మ‌హేష్ కూడా నటించారు. బజార్ రౌడీ బ్లాక్ బస్టర్ అయ్యింది. సోలో హీరోగా రమేష్ కి మొదటి విజయాన్ని అందించింది. 1989 లో అతను దాసరి నారాయణరావు బ్లాక్ టైగర్ .. వి. మధుసూధన్ రావు `కృష్ణ గారి అబ్బాయి` చిత్రాల్లో నటించాడు. 1990లో అతను కె. మురళీ మోహన్ రావు `ఆయుధం` S. S. రవిచంద్ర `కలియుగ అభిమన్యుడు` లో కనిపించాడు. 1991 లో `నా ఇల్లే నా స్వర్గం` లో కనిపించాడు. ఇందులో అతని తండ్రి కూడా నటించాడు. 1993 లో దాసరి నారాయణరావుతో `మామ కోడలు` చిత్రంలోనూ క‌నిపించాడు. ఆమని సరసన `అన్నా చెల్లెలు` చిత్రంలో న‌టించాడు. 1994 లో చివరిసారిగా పచ్చ‌తోర‌ణం చిత్రంలో క‌థానాయకుడిగా కనిపించాడు. ఈ చిత్రానికి అదుర్తి సాయి భాస్కర్ దర్శకత్వం వహించారు. రమేష్ సరసన రంభ నటించింది. 1997 లో ఎన్. శంకర్ తెర‌కెక్కించిన `ఎన్ కౌంటర్‌`లో సహాయక పాత్రలో కనిపించారు.

2004 లో రమేష్ బాబు హైదరాబాద్ లో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. అతను తన తండ్రి పేరునే కంపెనీకి పెట్టాడు. అర్జున్ చిత్రంతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించాడు. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోదరుడు మహేష్ బాబు- శ్రియ శరణ్‌- కీర్తి రెడ్డి- రాజా- ప్రకాష్ రాజ్ - సరిత నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 6 కేంద్రాలలో 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసింది. అతని నిర్మాణ సంస్థ రూ. మీనాక్షి అమ్మవారి టెంపుల్ సెట్ కోసం తోట తరణి కి కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ ని అందించి నిర్మించినందుకు ప్రశంస‌లు కురిసాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అతిథి చిత్రాన్ని ర‌మేష్ బాబు నిర్మించారు. మరోసారి అతని సోదరుడు మహేష్ బాబు ఇందులో హీరోగా నటించారు. మహేష్ సరసన అమృతరావు జతకట్టగా మురళీ శర్మ నెగెటివ్ పాత్రలో నటించారు. అతిధి కోసం రమేష్ బాబు నిర్మాణ సంస్థ యుటివి మోషన్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఒక కార్పొరేట్ కంపెనీ తెలుగు సినిమా నిర్మాణంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం ప్రతికూల సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 2011 లో అతను దూకుడు చిత్రానికి సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల వ‌ల్ల ఇంత‌కాలంగా సినీనిర్మాణంలో క‌నిపించ‌లేదు.