Begin typing your search above and press return to search.

'ఒక్కడు' క్లాసిక్ హిట్, నా ఆల్ టైం ఫేవరేట్: నమ్రత

By:  Tupaki Desk   |   15 Jan 2021 1:54 PM GMT
ఒక్కడు క్లాసిక్ హిట్, నా ఆల్ టైం ఫేవరేట్: నమ్రత
X
సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ సమయంలో రిలీజ్ అయ్యే సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడాలేకుండా పండగకి వచ్చిన సినిమాలన్నీ మాక్సిమం హిట్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. కానీ అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ అందుకుంటాయి. ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలకు పోటీగా విడుదలై బ్లాక్ బస్టర్ అవుతాయి. అదేవిధంగా సరిగా 18 సంవత్సరాల క్రితం అంటే 2003 జనవరి 15న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాంతి సందర్బంగా విడుదలైన సినిమాలలో ఒక్కడు సినిమానే బ్లాక్ బస్టర్ గా నిలిచి మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. మహేష్ కెరీర్ ఒక్కడు సినిమాకు ముందు ఒక్కడు తర్వాత అనే రేంజిలో స్టార్డం తెచ్చిపెట్టింది. MS రాజు గారు నిర్మించిన గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోహీరోయిన్ల తర్వాత చార్మినార్ సెట్ కీలకపాత్ర పోషించింది.

నిర్మాత MS రాజు గారు ఆ రోజుల్లో చాల పెద్ద ఎత్తున రిస్క్ చేసి అప్పట్లో హైదరాబాద్ సిటీ బయట నిర్మాత రామానాయుడు స్థలంలో కోటి డెబ్భై లక్షలతో చార్మినార్ సెట్ ను రూపొందించారు. ఈ సినిమాలో హీరోయిన్ భూమిక చాలా బాగా నటించింది. అలాగే మహేష్ సరసన మంచి కెమిస్ట్రీ పండించింది. ముఖ్యంగా మణిశర్మ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. మణిశర్మ బాణిలు, నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఇందులో ముఖ్యపాత్ర విలన్ ప్రకాష్ రాజ్ పోషించాడు. ప్రకాష్ రాజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఇవన్నీ పక్కన పెడితే కొండారెడ్డి బురుజు కూడా ఒక్కడు సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇక నేటితో ఒక్కడు సినిమా విడుదలై 18ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా మహేష్ సతీమణి నమ్రత ఒక్కడు సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందించింది. 'ఒక్కడు సినిమా మహేష్ కెరీర్ లో ఓ క్లాసిక్ హిట్. ఎక్కువసార్లు చూడవచ్చు. అంతేగాక ఈ సినిమా నా ఆల్ టైం ఫేవరేట్ సినిమా' అంటూ నమ్రత కొనియాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కడు సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.