Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: మ‌న‌సుంటే చాలు.. ప్రేమ‌కు వ‌య‌సుతో ప‌నేంటి?

By:  Tupaki Desk   |   7 May 2020 5:30 AM GMT
టాప్ స్టోరి: మ‌న‌సుంటే చాలు.. ప్రేమ‌కు వ‌య‌సుతో ప‌నేంటి?
X
స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు మ‌న‌సుంటే చాలు... క‌ళ్లు అవ‌స‌రం లేదు. రెండు హృద‌యాల ప్రేమ‌కు... చూపుల దోబూచులు.. ఆపై వ‌య‌సుతో అస‌లే సంబంధం లేదు. నిజ‌మైన ప్రేమ ప్రేమికుల్ని గెలిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రేమే విజేత‌ల్ని చేస్తుంది. ఎంత‌దూరంలో ఉన్నా.. ఏం చేస్తున్నా ప్రేమ‌లో ఉన్న నిజాయితీ స్వ‌చ్ఛత‌ ఆ బంధాన్ని గెలిపిస్తాయి. ఎప్ప‌టికీ ఎవరూ ప్రేయ‌సి నుంచి ప్రియుడిని వీడ‌దీయలేరు. ఇవ‌న్నీ ప్రేమకులంలో పుట్టుకొచ్చిన మాట‌లేనా? అంటే ఇవ‌న్నీ ప్రేమికులు చెబుతుంటారు. అప్పుడ‌ప్పుడు అవి నిజ‌మేనేమో అనిపిస్తుంటుంది కొంద‌రు జంట‌ల్ని చూస్తుంటే..ప్రేమించి పెళ్లి చేసుకున్న సెల‌బ్రిటీల లైఫ్ లోకి ఓసారి తొంగిచూస్తే! చాలా ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తాయి. ప్రేమ‌కు మ‌న‌సుంటే చాలు...దానికి వ‌య‌సుతో సంబంధం లేద‌ని ఇదిగో ఈ జంటలు నిరూపించాయి. అలాంటి ఫెయిర్స్ పై ఓ లుక్ ఏస్తే..

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా త‌న‌క‌న్నా 11 ఏళ్ల చిన్న వాడైన నిక్ జోన‌స్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వ‌య‌సులో చిన్నవాడైనా త‌న‌పైన కురిపించిన‌ ప్రేమకు స్పెల్ బౌండ్ అయిపోయి.. ఎంతో పెద్ద మ‌న‌సు ఉన్న‌వాడ‌ని...త‌న‌ని బాగా అర్ధం చేసుకున్న‌వాడ‌ని క‌మిటైపోయింది పీసీ. అస‌లు వ‌య‌సుతో సంబంధం ఏమిటి అంటూ మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. మ‌రో బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ కూడా త‌న‌కంటే ఆరు నెల‌లు చిన్న‌వాడై భార‌త సార‌థి విరాట్ కొహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఓ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన‌ప్పుడు స్నేహం కుదిరింది. అటుపై ప్రేమ‌లో ప‌డ్డారు. కొన్నాళ్లు పాటు డేటింగ్ అంటూ తిరిగిన జంట చివ‌రికి పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యారు.

ఇక టాలీవుడ్ హీరో మ‌హేష్ కంటే ఆయ‌న‌ భార్య న‌మ్ర‌త ‌శిరోద్క‌ర్ రెండేళ్లు పెద్ద‌. వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడీ జంట‌కి ఇద్ద‌రు పిల్ల‌లు. బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ భార్య ఐశ్వ‌ర్యారాయ్ రాయ్ కంటే రెండేళ్లు చిన్న‌వాడు. అభిషేక్ కుటుంబ స‌భ్యుల‌తో ఫైట్ చేసి మ‌రీ ఐశ్య‌ర్య‌ను పెళ్లాడాడు. అలాగే ఒక్క సినిమాలో కూడా న‌టించ‌క‌పోయినా నిజ జీవితంలో భాగ‌స్వాములైన సైఫ్ అలీఖాన్ కంటే అమృతా సింగ్ ప‌ద‌మూడేళ్లు పెద్ద‌. ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్ల‌కే ఈ జంట మ‌న్ప‌స్ప‌ర్థ‌లు కార‌ణంగా విడిపోయారు. సైఫ్‌ అలీఖాన్ అటుపై త‌న‌కంటే చాలా చిన్న వ‌య‌సు ఉన్న‌ క‌రీనా క‌పూర్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట‌కు థైమూర్ జ‌న్మించాడు. అలాగే బిపాసా బ‌సు త‌న‌క‌న్నా మూడేళ్లు చిన్న‌వాడైన క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. శిల్పాశెట్టి కూడా త‌న‌క‌న్న చిన్న‌వాడైన రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇంకా త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోతున్న అర్జున్ క‌పూర్ చేసుకునే భామ మ‌లైకా కూడా త‌న‌కంటే ప‌దిహేనెళ్లు పెద్ద‌ది. 46 ఏళ్ల మ‌లైకాను 32 ఏళ్ల అర్జున్ పెళ్లాడుతున్నాడంటూ బాలీవుడ్ లో మోతెక్కిపోతోంది. హాట్ ఐటం గీతాల‌తో హీటెక్కించే మ‌లైకం కొన్నేళ్ల‌గా అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉంది. అలాగే మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ కూడా త‌న‌కంటే 15 ఏళ్ల చిన్న‌వాడైన రొహ‌మాన్ ని పెళ్లాడ‌బోతుంది. వీరిద్ద‌రు కొన్నేళ్ల‌గా ప్రేమించుకుంటున్నారు. అలాగే నేహా దూపియా- అంగ‌ద్ భేడి జంట వ‌యోభేధం ఆల్వేస్ హాట్ టాపిక్. అంగ‌ద్ నేహా దూఫియా కంటే రెండేళ్లు చిన్న‌వాడు. ఇలా ప్రేమ‌జంట‌లు వ‌య‌సును చూసి ఒక్క‌ట‌వ్వ‌లేదు. ప్రేమ కుదిరింది. అటుపై పెద్ద‌ల్ని ఒప్పించి చేసుకుంటున్నారంతే.