Begin typing your search above and press return to search.

వర్మ ఉచ్చులో ఆమె పడింది

By:  Tupaki Desk   |   22 July 2018 5:16 PM IST
వర్మ ఉచ్చులో ఆమె పడింది
X
వివాదాలు రాజేసి ఆ వేడిలో చలి కాచుకోవడం రామ్ గోపాల్ వర్మకు బాగా అలవాటు. తన సినిమాలకు క్రేజ్ తేవడానికి ఇదే స్ట్రాటజీని అనుసరిస్తుంటాడు. సొసైటీలో హాట్ టాపిక్ అవుతున్న అంశాలు.. లేదా వ్యక్తుల మీద సినిమాలు అనౌన్స్ చేయడం.. ఆ క్రమంలో వచ్చే రెస్పాన్స్‌ ను బట్టి సినిమా తీయాలా వద్దా అన్న నిర్ణయానికి రావడం అలవాటు. ఇలా గతంలో ఎన్నో ప్రకటనలు చేసి.. వాటిలో చాలా కొద్ది ప్రాజెక్టుల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లాడు వర్మ. తాజాగా ఆయన సంజయ్ దత్ మీద సినిమా తీస్తానన్నాడు. రాజ్ కుమార్ హిరాని రూపొందించిన సంజయ్ బయోపిక్ లో వాస్తవాల్ని చాలా వరకు దాచేశారని.. సంజయ్ ను ఉత్తముడిగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. సంజయ్ కు సంబంధించి అసలు కథను తాను చూపిస్తానంటూ వర్మ ప్రకటన చేశాడు.

ఒకప్పుడైతే వర్మ ఇలాంటి ప్రకటన చేస్తే రెస్పాన్స్ ఓ రేంజిలో ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఆయన క్రెడిబిలిటీ బాగా దెబ్బ తినేయడంతో ఈ ప్రకటనను లైట్ తీసుకున్నారు. బాలీవుడ్ మీడియా కూడా ఈ వార్తకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇంతటితో కథ ముగిసినట్లే అనుకుంటుండగా.. సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ వర్మ కోరుకున్న విధంగా స్పందించింది. ఆయన్ని తిట్టి పోసింది. ప్రధానంగా సంజయ్ దత్ అక్రమాయుధాల కేసు నేపథ్యంలోనే తన సినిమా ఉంటుందని వర్మ ప్రకటించిన నేపథ్యంలో నమ్రత స్పందిస్తూ.. ‘‘అక్రమాయుధాల కేసు సంజు జీవితంలోని ఓ బాధాకరమైన ఘటన. దాన్ని వర్మ ఎందుకు తవ్వాలనుకుంటున్నారు? ఆర్జీవీ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలే. అలాంటప్పుడు బయోపిక్‌ తో సంజును క్షోభ పెట్టాలనుకుంటున్నారా? మమల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని ఆయన చూస్తున్నారా?’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే సంజుకి అభ్యంతరం లేకపోతే తాము వర్మ ప్రయత్నానికి అడ్డుతగలబోమని ఆమె స్పష్టం చేశారు. తన ప్రకటనపై సంజయ్ దత్ కూడా స్పందించి గొడవ చేస్తే వర్మకు ఆనందం. అప్పుడు ముందే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందనుకుంటాడు. మరి తన సోదరిలాగే సంజు కూడా వర్మ ఉచ్చులో పడతాడేమో చూడాలి.