Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘నక్షత్రం’

By:  Tupaki Desk   |   4 Aug 2017 10:01 AM GMT
మూవీ రివ్యూ : ‘నక్షత్రం’
X
చిత్రం : ‘నక్షత్రం’

నటీనటులు: సందీప్ కిషన్ - సాయిధరమ్ తేజ్ - రెజీనా - ప్రగ్యా జైశ్వాల్ - తనీష్ - ప్రకాష్ రాజ్ - శివాజీ రాజా - తులసి - రఘుబాబు తదితరులు
సంగీతం: భీమ్స్ - భరత్ - హరి గౌర
ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్
మాటలు: తోట ప్రసాద్ - పద్మశ్రీ - కిరణ్ తటవర్తి
నిర్మాతలు: శ్రీనివాసులు - వేణుగోపాల్ - సజ్జు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కృష్ణవంశీ

‘గులాబీ’తో మొదలుపెట్టి తెలుగులో ఎన్నో క్లాసిక్స్ తీసిన విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ. ఐతే దాదాపు దశాబ్ద కాలంగా కృష్ణవంశీ నుంచి సరైన సినిమా రాలేదు. చివరగా ఆయన తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ కూడా నిరాశ పరిచింది. ఇప్పుడాయన ‘నక్షత్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా అయినా కృష్ణవంశీ మార్కును చూపించిందేమో.. ఆయన్ని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిందేమో చూద్దాం పదండి.

కథ:

రామారావు (సందీప్ కిషన్) పోలీస్ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. అతడి ముత్తాత.. తాత.. తండ్రి ముగ్గురూ పోలీసులే. తాను కూడా వాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎస్సై కావాలనుకుంటాడు. అదే లక్ష్యంతో కష్టపడుతుంటాడు. పోలీస్ అయ్యేందుకు అతను చేసిన ప్రయత్నాలు ఫలించవు. చివరి అవకాశం కూడా కొన్ని కారణాల వల్ల చేజారుతుంది. అలాంటి పరిస్థితుల్లో జీవితాన్నే చాలించాలనుకున్న అతడు.. మళ్లీ మనసు మార్చుుకుని ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకీ ఆ నిర్ణయమేంటి.. దాని వల్ల రామారావు జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొందరు దర్శకులు ఎన్ని ఫ్లాపులిచ్చినా.. ఎన్నిసార్లు నిరాశ పరిచినా.. వాళ్ల మీదున్న అభిమానం అంత సులువుగా పోదు. ఈసారైనా.. ఈసారైనా.. అంటూ ఆశగా చూస్తాం. మళ్లీ వాళ్ల మార్కు సినిమా వస్తుందని.. ఒకప్పటి మెరుపులు మళ్లీ చూస్తామని ఆశిస్తాం. కృష్ణవంశీ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఒక ‘గులాబి’.. ఒక ‘నిన్నే పెళ్లాడతా’.. ఒక ‘సింధూరం’.. ఒక ‘ఖడ్గం’.. మామూలు సినిమాలా అవి? కృష్ణవంశీ వేసిన ముద్ర అలాంటిలాంటిదా? అందుకే ఆయన గత కొన్నేళ్లలో ఎంత పేలవమైన సినిమాలు తీసినా.. మళ్లీ ఆశగా ‘నక్షత్రం’ వైపు చూశారు ఆయన అభిమానులు. కానీ కృష్ణవంశీ అభిమానుల్ని నిరాశకు గురి చేయడంలో గత సినిమాలన్నింటినీ మించిపోయింది ‘నక్షత్రం’. గతంలో కృష్ణవంశీ తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా ఏదో ఒక అంశంలో మెప్పించేవి. ఎంతో కొంత ఎంటర్టైన్ చేసేవి. కానీ ‘నక్షత్రం’లో అలాంటి అంశాల జాడే లేకపోవడం విచారకరమైన విషయం.

‘నక్షత్రం’ ప్రోమోలు చూస్తే హీరోయిన్ల అందాల్ని చూపించి ఎరవేస్తున్నట్లుగా అనిపించింది జనాలకు. ఐతే కృష్ణవంశీ ట్రాక్ రికార్డు దెబ్బ తిన్న నేపథ్యంలో ముందు ప్రేక్షకు దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి గిమ్మిక్కులు తప్పవులే.. తనకు వంద శాతం సంతృప్తినిచ్చిన సినిమా అంటూ ‘నక్షత్రం’ గురించి కృష్ణవంశీ ధీమాగా చెప్పాడు కాబట్టి ఇందులో ‘విషయం’ బలంగా ఉంటుందిలే.. ఈ క్రియేటివ్ డైరెక్టర్ నుంచి ‘ఖడ్గం’ తరహాలో మరో హార్డ్ హిట్టింగ్ మూవీ చూడబోతున్నాంలే అన్న ఆశ ఏదో కోశాన కనిపించింది. కానీ ‘నక్షత్రం’లో ఆ హీరోయిన్లను రతీ దేవతల్లా చూపించి వాళ్ల అందాల్ని ఎలివేట్ చేయడం తప్పిస్తే కృష్ణవంశీ మెప్పించిందేమీ లేదు.

కృష్ణవంశీ సినిమాలంటే తెరమీద చాలా క్యారెక్టర్లు కనిపించడం.. నటీనటులంతా అతిగా నటించడం.. అతిగా అరవడం.. తెరమీద జనాలు గుంపులు గుంపులుగా కనిపించడం.. అందులో ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్లు నటించేస్తుండటం.. అంతా గలాభా గలాభాగా అనిపించడం మామూలే. ఐతే వీటన్నింటికీ కూడా నిన్నటితరం ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారు. ప్రేమనైనా.. బాధనైనా.. ఏ ఎమోషనైనా కృష్ణవంశీ చాలా గాఢతతో చెప్పేవాడు కాబట్టి అప్పటి సినిమాల్లో ఈ ‘అతి’ సింక్ అయిపోయేది. ‘నక్షత్రం’లో కూడా ప్రతి సన్నివేశంలోనూ ఈ ‘అతి’ కనిపిస్తుంది. కానీ ఒకప్పట్లా ఇందులో ఎమోషన్లను తనదైన ఇంటెన్సిటీతో మాత్రం చెప్పలేకపోయాడు కృష్ణవంశీ.

క్రియేటివ్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకున్న దర్శకుడు.. ఇంత రొటీన్ కథను తీసుకుని.. దాన్ని ఇంత సాదాసీదాగా చెబుతాడని అనుకోలేం. అసలే సాదాసీదా కథ. దానికి తోడు ప్రధాన పాత్రలు వేటినీ సరిగా తీర్చిదిద్దలేదు. సన్నివేశాల్లోనూ కొత్తదనం లేదు. వినోదం కానీ.. ఎమోషన్లు కానీ ఎక్కడా పండలేదు. అసలు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా ఒక్క పాత్రా లేదు ‘నక్షత్రం’లో. కృష్ణవంశీ ఒకప్పుడు తీసిన సినిమాల్లోని సన్నివేశాల్నే రసం తీసేసి చూస్తున్న భావన కలిగిస్తుంది ‘నక్షత్రం’. సటిల్ కామెడీ.. సటిల్ ఎమోషన్లకు అలవాటు పడ్డ ఈ తరం ప్రేక్షకులకైతే ‘నక్షత్రం’లోని క్యారెక్టర్లు.. పాత్రధారుల నటన.. ఆ కెమెరా యాంగిల్స్.. ఆ మ్యూజిక్ అన్నీ కూడా చాలా లౌడ్ గా అనిపించి.. చికాకు పడేలా చేస్తాయి.

సందీప్ కిషన్ పాత్ర మొదలైన తీరే.. సినిమా గమనం ఎలా ఉండబోతోందన్న ఐడియా ఇచ్చేస్తుంది ప్రేక్షకులకు. ఎస్ ఐ కావడం కోసం అతడి డెస్పరేషన్ చూస్తే.. అతడి ఆశలకు ఏదో ఒక దశలో బ్రేక్ పడిపోతుందన్న అంచనా వచ్చేస్తుంది. ఆ అంచనాలకు తగ్గట్లే కథనం నడుస్తుంది. పాత్రల పరిచయం దగ్గరే కృష్ణవంశీ పాత సినిమాల ఛాయలు అడుగడుగునా కనిపిస్తాయి. తర్వాత అయినా ఏదో ‘క్రియేటివిటీ’ చూపించకపోతాడా అని ఆసక్తిగా చూస్తాం కానీ.. తలా తోకా లేని సన్నివేశాలు.. పాటలతో ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేయడం మొదలవుతుంది. ప్రగ్యా జైశ్వాల్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు.. సందీప్-ప్రగ్యా మధ్య వచ్చే పాట చూశాక మనమేం సినిమా చూస్తున్నామో అర్థం కాని అయోమయంలో పడిపోతాం. ఇంటర్వెల్ పాయింట్ దగ్గర కథ కొంచెం మలుపు తీసుకుని.. ద్వితీయార్ధం మీద కొంచెం ఆసక్తి కలిగిస్తుంది.

కానీ ద్వితీయార్ధం పూర్తిగా నిరాశ పరుస్తుంది. హీరో సిటిజన్ పోలీస్ అవతారం ఎత్తాక ఎలా ‘హీరో’ అవుతాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తే.. ఆ ‘హీరోయిజం’ ఏమీ చూపించకకుండా బ్రేక్ వేసేసి.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయాడు కృష్ణవంశీ. కనీసం సాయిధరమ్ రాకతో అయినా ‘నక్షత్రం’ మెరుస్తుందనుకుంటే.. అతణ్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. తేజు చేసిన అలెగ్జాండర్ పాత్ర గురించి ఇచ్చే శివాజీ రాజా ‘పోలీస్ సింహం’ అంట ఇచ్చే బిల్డప్ చూస్తే ‘విక్రమార్కుడు’ స్థాయిలో ఊహించుకుటాం. కానీ తేజు ఫ్లాష్ ఎపిసోడ్ విషయంలోనూ కృష్ణవంశీ అదే ‘ఫామ్’ను కొనసాగించి చాలా పేలవంగా తయారు చేశాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక చోట ప్రకాష్ రాజ్ వీరావేశంతో డైలాగులు చెప్పే సీన్ చూస్తే కృష్ణవంశీ ఎంత ఔట్ డేట్ అయిపోయాడో కదా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అయ్యేసరికే పుణ్యకాలం గడిచిపోగా.. మళ్లీ వర్తమానంలోకి వచ్చి ముప్పావుగంట పాటు కథను సాగదీయడంతో ప్రేక్షకుల అసహనం పతాక స్థాయికి చేరుకుంటుంది. తేజు పాత్రను ముగించే సన్నివేశం అయితే ఎంతగా ఇరిటేట్ చేస్తుందో మాటల్లో చెప్పలేం. తన సినిమాపై కృష్ణవంశీకి ఎంత ప్రేమ ఉన్నా కూడా నిడివి 2 గంటల 46 నిమిషాలు ఉంచేయడమన్నది టూమచ్. మొత్తంగా ‘నక్షత్రం’లో చెప్పుకోదగ్గ అంశాలేమైనా ఉన్నాయంటే.. అవి హీరోయిన్ల అందాల్ని ఎలివేట్ చేసిన పాటలే. అక్కడ మాత్రమే కృష్ణవంశీ తాలూకు సానుకూల ‘ముద్ర’ కనిపిస్తుంది.

నటీనటులు:

తన పాత్ర ఎలా ఉన్నప్పటికీ సందీప్ కిషన్ మాత్రం సిన్సియర్ గా నటించాడు. అతడి కష్టం తెరమీద కనిపిస్తుంది. తనకిక ఎస్ఐ అయ్యే అవకాశం లేదని తెలిసినపుడు ఎమోషనల్ అయ్యే సన్నివేశాల్లో సందీప్ చాలా బాగా చేశాడు. సందీప్ ఎంత మంచి నటుడో ఈ సన్నివేశాల్లో తెలుస్తుంది. కొన్ని చోట్ల కృష్ణవంశీ స్టయిల్లో ‘అతి’గా చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ ఓవరాల్ గా సందీప్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ గెటప్.. అతడి స్టయిల్ ఆకట్టుకుంటాయి. నటన జస్ట్ ఓకే అనిపిస్తుంది. రెజీనా.. ప్రగ్యా జైశ్వాల్.. ఇద్దరూ కూడా అందాల ప్రదర్శనలో పోటీ పడ్డారు. నటన విషయంలో మాత్రం ఇద్దరూ ఇరిటేట్ చేస్తారు. అందులో వాళ్లిద్దరినీ తప్పుబట్టడానికి కూడా ఏమీ లేదు. ప్రకాష్ రాజ్ విషయంలోనూ అంతే. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఆవేశం.. అరుస్తూ డైలాగులు చెప్పే తీరు శ్రుతి మించి పోయింది. తులసి కూడా అతిగా నటించేసింది. డ్రగ్ అడిక్ట్ పాత్రలో తనీష్ ఆకట్టుకుంటాడు. అతడి లుక్ బాగుంది. నటన కూడా ఓకే. కాకపోతే ఇలాంటి సినిమాలో లీడ్ విలన్ పాత్రకు సరిపోలేదనిపిస్తుంది.

సాంకేతికవర్గం:

వర్మ తరహాలోనే కృష్ణవంశీ సినిమాల్లోనూ టెక్నీషియన్స్ మారినా ఔట్ పుట్ మాత్రం ఒకేలా ఉంటుంది. ‘నక్షత్రం’లోనూ అంతే. ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం. పాటలు ఓకే అనిపిస్తాయి. అన్నింట్లోకి ‘పెదవికి నువ్వంటే ప్రాణం..’ పాట ప్రత్యేకతంగా అనిపిస్తుంది. తేజు-ప్రగ్య మధ్య వచ్చే పాట కూడా ఆకట్టుకుంటుంది. పాటల చిత్రీకరణ కూడా ఓకే. నేపథ్య సంగీతం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. కెమెరా పనితనం అంతా కృష్ణవంశీ శైలికి తగ్గట్లుగా సాగింది. అనుకున్న బడ్జెట్ కంటే 30 శాతం పెరిగినట్లు.. చాలామంది ఉచితంగా పని చేసినట్లు కృష్ణవంశీ చెప్పినప్పటికీ.. నిర్మాణ విలువలు మాత్రం ఏమంత గొప్పగా అనిపించవు. సినిమా ఓవరాల్ లుక్కే ఏదో పాత సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది. ఇక దర్శకుడు కృష్ణవంశీ విషయానికి వస్తే.. ఆయన దశాబ్దం వెనుకే స్ట్రక్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది ‘నక్షత్రం’ చూస్తున్నంతసేపూ. కృష్ణవంశీ ఒకప్పుడు తీసిన క్లాసిక్స్ గుర్తు చేసుకుని.. ఈయన ఆయనేనా అని సందేహాలు రేక్తించేలా సాగుతుందీ సినిమా. కథ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ ఆయన నిరాశ పరిచారు.

చివరగా: పట్టపగలు ‘నక్షత్రాలు’ కనిపిస్తాయ్!

రేటింగ్- 1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre