Begin typing your search above and press return to search.

హలో గురు.. వెంకీ ఫిక్స్‌ అయ్యాడట!

By:  Tupaki Desk   |   24 Oct 2018 11:42 AM IST
హలో గురు.. వెంకీ ఫిక్స్‌ అయ్యాడట!
X
యూత్‌ ఆడియన్స్‌ కు కనెక్ట్‌ అయ్యేలా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన తాజాగా రామ్‌ హీరోగా ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. మొన్న దసరాకు విడుదలైన ఆ చిత్రం యావరేజ్‌ టాక్‌ ను దక్కించుకుంది. అంతకు ముందు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘సినిమా చూపిస్తా మావ’ మరియు ‘నేను లోకల్‌’ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే వెంకటేష్‌ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

హలో గురు ప్రేమకోసమే చిత్రం విడుదలకు ముందు నుండి కూడా వెంకీ - త్రినాధరావు నక్కినల మూవీ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వెంకటేష్‌ మూవీకి త్వరలోనే క్లాప్‌ పడబోతుంది. వీరి కాంబినేషన్‌ లో మూవీని కిరణ్‌ రెడ్డి - భరత్‌ చౌదరిలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు సమర్పించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.

ప్రస్తుతం వెంకటేష్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ తో కలిసి అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ చకచకా జరుగుతుంది. మరో వైపు అల్లుడు నాగచైతన్యతో కలిసి బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. వచ్చే నెల రెండవ వారంలో వెంకీ మామ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత వెంకీ - త్రినాధరావు నక్కినల కాంబో మూవీ ఉండే అవకాశముంది.