Begin typing your search above and press return to search.

నాగ్ తో పాతికేళ్ల మిస్ ఇండియా రొమాన్స్..?

By:  Tupaki Desk   |   23 Feb 2023 10:00 PM GMT
నాగ్ తో పాతికేళ్ల మిస్ ఇండియా రొమాన్స్..?
X
సీనియర్ అండ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన్మథుడిగా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఎన్నో సూపర్ డూపర్ చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్నాడు. ఇప్పటికీ నాగార్జునను రొమాన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు. ఆరు పదుల వయసులోకి వచ్చిన ఆయన అందం ఏమాత్రం తగ్గలేదు. చూడడానికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుడిలా కనిపిస్తూ.. సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల ఆయన కనిపిస్తున్న చిత్రాలన్నీ ఫ్లాప్ లుగానే నిలిచాయి.

ఒకప్పుడు అన్ని రకాల సినిమాల్లో కనిపించిన కింగ్ నాగార్జున ఈ మధ్య కేవలం యాక్షన్ చిత్రాల్లోనే కనిపిస్తున్నాడు. చివరగా నాగార్జున హీరోగా నటించిన ధి ఘోస్ట్ కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. కానీ ఈసారి అదిరిపోయే కథతో కనిపించి సూపర్ డూపర్ హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు.

ఈ క్రమంలోనే రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో పాతకాలపు సెటప్ లో పక్కా కమర్షియల్ సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు నాగ్. అంతేకాదండోయ్ ఈ చిత్రంలో పాతికేళ్ల మిస్ ఇండియాతో నాగ్ రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న హైదరాబాద్ వాసి మానస వారణాసి ఈ సినిమాలో నాగార్జున సరసన నటించబోతున్నారట. అంతేకాదండోయ్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వీరిద్దరి ఫొటో షూట్ జరిగినట్లు తెలుస్తోంది.

ఎన్నో రోజులుగా మానస వారణాసి.. ఏదైనా బ్రేక్ ఇచ్చే పాత్రలో నటించాలని చూస్తోంది. అయితే కొత్త వారిని తెరకు పరిచయం చేయడంలో పాపులర్ అయిన నాగార్జున సరసన నటించేందుకు ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ఆఫర్ గురించి ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.

కానీ ఇటీవలి కాలంలో సీనియర్ హీరోలు ముఖ్యంగా 60, 70 ఏళ్లకు చేరువైన వాళ్ల సరసన చాలా చిన్న వయస్సు గల నటీమణులను ఎంపిక చేయడం సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. అందుకే కొంతమంది సీనియర్ హీరోలు చిన్న వయసు హీరోయిన్ల కంటే 30 దాటిన వాళ్లతో నటించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నాగ్.. రకుల్ ప్రీత్ తో కలిసి నటించిన మన్మథుడు 2 ప్లాప్ గా నిలిచింది. మరి ఈ పాతికేళ్ల మిస్ ఇండియాతో నాగ్ తెరపై ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.