Begin typing your search above and press return to search.

బాహుబ‌లి ప్ర‌స్తావ‌న వద్దు నాగ్‌

By:  Tupaki Desk   |   16 Oct 2015 10:30 PM GMT
బాహుబ‌లి ప్ర‌స్తావ‌న వద్దు నాగ్‌
X
బాహుబ‌లిని చూసి ఇన్‌ స్పైర్ అయ్యి అలాంటి ప్ర‌య‌త్నం చేసిన‌వాళ్లు కూడా ఇటీవ‌ల మా సినిమాకీ, బాహుబ‌లికీ మ‌ధ్య పోలిక లేదు మొర్రో అని మొత్తుకొన్నారు. వాళ్ల సినిమా ప్ర‌చారంలోనూ అదే మాట‌ని వాడారు. బాహుబ‌లిని చూసిన క‌ళ్ల‌తో సినిమాకొస్తే అస‌లుకే ఎస‌రొస్తుంద‌ని వాళ్ల భయం మ‌రి! నిజంగానే బాహుబ‌లి ఆ రేంజ్ స్టాండ‌ర్డ్స్‌ ని క్రియేట్ చేసి వెళ్లిపోయింది. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ లో. ఏ సినిమా వ‌చ్చినా స‌రే బాహుబ‌లితో కంపేర్ చేసుకొంటున్నారు. కానీ ఆ రేంజ్‌లో గ్రాఫిక్స్ చేయ‌డమంటే ఆషామాషీ కాదు. డ‌బ్బు - స‌మ‌యం చాలా అవ‌స‌ర‌మ‌వుతాయి. మొన్న వ‌చ్చిన రుద్ర‌మ‌దేవిని కూడా బాహుబ‌లితో పోల్చి చూసుకొని అందులో గ్రాఫిక్స్‌ ని వేలెత్తి చూపించారు. అందుకే బాహుబ‌లి విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా చాలా జాగ్ర‌త్త‌గా అడుగులేస్తున్నారు. వీలైనంత‌వ‌ర‌కు ఆ సినిమా ప్ర‌స్తావ‌న తీసుకురారు.

కానీ నాగార్జున మాత్రం త‌న కొడుకు అఖిల్ సినిమా గ్రాఫిక్స్ వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతోంద‌ని చెప్ప‌డానికి బాహుబ‌లిని బ‌య‌టికి లాగాడు. ఆ సినిమా కూడా యేడాదిన్న‌ర‌పాటు వాయిదా ప‌డిందంటే కార‌ణం గ్రాఫిక్సే అని... ఇప్పుడు త‌న కొడుకు సినిమా కూడా ఆ కార‌ణం చేత‌నే వాయిదా ప‌డింద‌ని చెప్పుకొచ్చాడు. అంత‌టితో ఆగ‌కుండా బాహుబ‌లితో రాజ‌మౌళి స్టాండ‌ర్డ్స్ సెట్ చేశాడ‌ని, అలాంట‌ప్పుడు త‌న కొడుకు సినిమాలో గ్రాఫిక్స్ మామూలుగా ఉంటే ఏం బావుంటుంద‌ని, అందుకే తాను కూడా సినిమాని వాయిదా వేసేయండ‌ని రెక్వెస్ట్ చేసిన‌ట్టు నాగ్ చెప్పుకొచ్చాడు. మ‌రి నాగ్ బాహుబ‌లి స్టాండ‌ర్డ్స్ గురించి మాట్లాడాక ప్రేక్ష‌కులు అఖిల్ సినిమాని కూడా ఆ స్థాయిలో ఊహించ‌రా? అన్న‌దే ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే అఖిల్ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ రేంజ్ అంచ‌నాల్ని అందుకోవ‌డ‌మే ఓ పెద్ద స‌మ‌స్య‌. ఇప్పుడు ఏకంగా బాహుబ‌లిని పోలుస్తూ మాట్లాడితే ఆ అంచ‌నాలు రెట్టింపు కావా? నాగ్ ఆ విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్టున్నాడు. భ‌విష్య‌త్తులో మాత్రం నాగ్ బాహుబ‌లిని ప్ర‌స్తావించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.