Begin typing your search above and press return to search.

ట్రెండ్ సెట్టర్ నాగార్జున మరో ట్రెండ్ సెట్ చేశాడుగా...!

By:  Tupaki Desk   |   3 Sep 2020 12:10 PM GMT
ట్రెండ్ సెట్టర్ నాగార్జున మరో ట్రెండ్ సెట్ చేశాడుగా...!
X
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన 'కింగ్' నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలు విలక్షమైన పాత్రల్లో నటిస్తూ పాత్ బ్రేకర్ గా ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు నాగ్. స్టార్ డైరెక్టర్స్ వెంట పరుగులు తీయకుండా టాలీవుడ్ కి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్న ట్రెండ్ సెట్టర్ నాగ్ మరో ట్రెండ్ సెట్ చేశారు. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం షూటింగులకు అనుమతివ్వడంతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే కరోనా తీవ్రత రోజురోజుకి ఎక్కువ అవుతుండటంతో స్టార్ హీరోలెవరూ సెట్స్ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేయడం లేదు. కానీ కింగ్ నాగార్జున తాను నటిస్తున్న సినిమా సెట్స్ లో అగుడుపెట్టేసాడు.

కాగా అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్‌ డాగ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. వాస్తవ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 'ఊపిరి'కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అహిషోర్ సాల్మోన్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు నాగ్. దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సయామి ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుగునున్న ఈ సినిమాకి కరోనా బ్రేక్స్ వేసింది.

అయితే లేటెస్టుగా 'వైల్డ్‌ డాగ్' మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టేసాడు. ఈ చిత్రం షూటింగ్‌ లో వారు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో అభిమానులకు చెప్పడానికి 'వైల్డ్‌ డాగ్' మేకర్స్ షూటింగ్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ జరుపుతున్నట్లు తెలుస్తోంది. లీడ్ యాక్టర్స్ తో సహా టెక్నీషియన్స్ బాయ్స్ అందరూ సెట్స్ లో అడుగుపెట్టింది మొదలు శానిటైజర్స్ మాస్కులు వంటివి వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ కనిపించారు. నాగార్జున సైతం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులు బయటకు రావడానికే ఆలోచిస్తుంటే కింగ్ నాగ్ మాత్రం ధైర్యంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడని చెప్పవచ్చు. మరి నాగ్ ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా స్టార్ హీరోలు షూటింగులు చేస్తారేమో చూడాలి.