అరవోళ్లపై అంత శ్రద్ధ ఏంటి నాగ్?
By: Tupaki Desk | 27 Feb 2016 11:00 PM ISTఇంతకుముందులాగా మన సినిమా మనోళ్లకు మాత్రమే అని హద్దులు గీసుకుని కూర్చోవట్లేదు మన హీరోలు. ఈగ, బాహుబలి లాంటి సినిమాలు వేరే భాషల మార్కెట్లో వసూళ్ల వర్షం కురిపించాక మిగతా హీరోలు, నిర్మాతలకు కూడా పొరుగు రాష్ట్రాలపైకి దృష్టిమళ్లింది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలన్నీ కూడా తమిళంలోనూ విడుదల కాబోతున్నవే. ఐతే నాగార్జున సినిమా ఊపిరి మిగతా వాటిలా తెలుగులో తీసి డబ్ చేయకుండా ఒకేసారి తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొళ పేరుతో తమిళ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. నాగార్జున ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.
ఎన్నడూ లేనిది తొలిసారి తమిళంలో డబ్బింగ్ చెబుతున్నాడు నాగ్. తమన్నా సైతం తొలిసారి తన సొంత గొంతు వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా విడుదలకు ఇంకా నెల పైగా సమయం ఉండగానే పీవీపీ సంస్థ సెన్సార్ కూడా కానిచ్చేసింది. ఆడియో సైతం తెలుగులో కంటే ముందు తమిళంలోనే రిలీజ్ చేశారు. తెలుగు ఆడియో వేడుక మంగళవారం జరగబోతుండగా.. నాలుగు రోజుల ముందే శుక్రవారం నాడు తమిళ ఆడియో రిలీజ్ చేశారు. కార్తి సోదరుడు సూర్య ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. పీవీపీ స్థాయికి తగ్గట్లు పెద్ద రేంజిలో ఈ వేడుక చేశారు.నాగార్జునతో డబ్బింగ్ చెప్పించడం.. ముందే సెన్సార్ చేయించడం.. ముందే ఆడియో ఫంక్షన్ చేయడం.. ఇదంతా చూస్తుంటే నాగ్ అండ్ కో ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతుంది. ఊపిరి తమిళ వెర్షన్ విషయంలో మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
