Begin typing your search above and press return to search.

నాగ్ మంచి మాటే చెప్పాడు కానీ..

By:  Tupaki Desk   |   18 March 2016 5:30 PM GMT
నాగ్ మంచి మాటే చెప్పాడు కానీ..
X
తెలుగు సినిమాల్లో ఈ మధ్య చాలా మంచి మార్పు వచ్చిందని.. వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కుతున్నాయని.. అందులోనూ ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగు సినిమా అద్భుతంగా సాగుతోందని సంబరపడ్డాడు అక్కినేని నాగార్జున. ఐతే సినిమాలు మరీ ఎక్కువైపోతుండటం ఇబ్బందే అని.. వారానికి నాలుగు సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఎక్కడ చూస్తారని ప్రశ్నించాడు నాగ్. ఇలా పోటీ పెంచుకుని.. మన సినిమాల్ని మనమే చంపుకుంటున్నామని.. రాశి కంటే వాసి ముఖ్యం అనేది గ్రహించాలని నాగ్ హితవు పలికాడు.

నాగ్ చెప్పింది చాలా మంచి మాటే. ఒకేవారం నాలుగైదు సినిమాలు రిలీజైతే ప్రేక్షకుడికి చిరాకు పుడుతుంది. అందులో ది బెస్ట్ ఏదో చూసుకుంటాడు. ఓ మోస్తరుగా ఉన్న సినిమాను కూడా పట్టించుకోడు. ఇలా గత రెండు నెలల కాలంలో ఏవరేజ్ సినిమాలు చాలా అన్యాయం అయిపోయాయి. ఐతే ఇలా ఒకేసారి ఇన్నేసి సినిమాలు పోటీపడ్డానికి కారణమేంటో నిర్మాత కూడా అయిన నాగార్జునకు తెలియంది కాదు.

ఈ రెండు నెలల్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చినవన్నీ చిన్న సినిమాలే. ఇది అన్ సీజన్ కాబట్టి.. ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడూ తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ఛాన్సుండదు కాబట్టే అలా తామరతంపరగా సినిమాల్ని వదలాల్సి వచ్చింది. సంవత్సరంలో మిగతా శుక్రవారాలన్నీ పెద్ద సినిమాలకే వదిలేయాలి. థియేటర్లు దొరకవు. అందులోనూ మరీ బడా సినిమాలు వస్తే ముందు, వెనక వారాలు కూడా చిన్న సినిమాలకు ఛాన్సుండదు. సినిమాలు పూర్తయి విడుదల కాకుండా అలా బాక్సుల్లో మగ్గిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ఒకేసారి అన్నేసి సినిమాల్ని రిలీజ్ చేయాల్సి వస్తోంది. అంతే తప్ప చేజేతులా సినిమాల్ని చంపేసుకుందామని కాదు.