Begin typing your search above and press return to search.

నాగ్.. ఏఎన్నార్ విగ్రహం ఏమైంది?

By:  Tupaki Desk   |   3 Dec 2015 11:13 AM GMT
నాగ్.. ఏఎన్నార్ విగ్రహం ఏమైంది?
X
తెలుగు సినీ పరిశ్రమకు ఓ కన్ను నందమూరి తారకరామారావు అయితే... ఇంకో కన్ను అక్కినేని నాగేశ్వరరావు. తన అద్భుత నటనా కౌశలంతో తెలుగు తెరను సుసంపన్నం చేయడమే కాదు... చెన్నై నుంచి తెలుగు పరిశ్రమను హైదరాబాదుకు తీసుకురావడం ద్వారానూ తెలుగు సినిమా పురోగతిలో తన వంతు పాత్ర పోషించారు ఏఎన్నార్. పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించిన ఏఎన్నార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి రెండేళ్లు కావస్తోంది. ఐతే ఇంత కాలానికి కూడా అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహం ఏర్పాటు కాకపోవడంతో ఆయన అభిమానుల్నే కాదు.. పరిశ్రమ వర్గాల్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఏఎన్నార్ కు అన్నపూర్ణ స్టూడియోతో ఎంత అనుబంధం ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్టూడియో కట్టాక తన జీవితంలో చాలా సమయాన్ని అక్కడే గడిపారు. ముఖ్యంగా భార్య అన్నపూర్ణ చనిపోయాక.. ఆమె విగ్రహాన్ని తన పేరుతో కట్టిన స్టూడియో ప్రతిష్టించి అక్కడే చాలా సమయం ఉండేవారు ఏఎన్నార్. నిరుడు ఏఎన్నార్ చనిపోయాక ఆయన అంత్యక్రియలు కూడా స్టూడియోలోనే జరిగాయి. అన్నపూర్ణ విగ్రహం పక్కనే ఏఎన్నార్ విగ్రహం ఏర్పాటు చేస్తారని అప్పుడే వార్తలొచ్చాయి. నాగ్ ఆలోచన కూడా అదే అన్నారు. కానీ ఇప్పటిదాకా ఆ ఆలోచన కార్యరూపం దాల్చకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో ఏదైనా కారణాల వల్ల ఆలస్యం జరుగుతోందా లేక విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచనే మానుకున్నారా అన్నది తెలియడం లేదు.