Begin typing your search above and press return to search.

మొదటిదే రాలేదు.. అప్పుడే సీక్వెలట

By:  Tupaki Desk   |   2 Aug 2018 10:30 PM GMT
మొదటిదే రాలేదు.. అప్పుడే సీక్వెలట
X
కింగ్ అక్కినేని నాగార్జున.. నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గురించి నాగ్ చాలా గొప్పగా మాట్లాడేస్తున్నాడు. ఇంకా ఈ చిత్రం రిలీజ్ కాకుండానే దీనికి సీక్వెల్ కూడా చేస్తామని నాగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చిందని.. ఇంకో పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని నాగ్ వెల్లడించాడు. ఈ సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు చాలా హిలేరియస్ గా సాగుతుందని.. ఎక్కడా నవ్వులు ఆగవని నాగ్ చెప్పాడు. హిందీలో రాజ్ కుమార్ హిరాని సినిమాల తరహాలో ‘దేవదాసు’ ఉంటుందని నాగ్ వెల్లడించాడు.

నానితో నటించడం చాలా సంతోషమన్న నాగ్.. అతను చాలా చక్కటి తెలుగులో మాట్లాడతాడని.. వినడానికి హాయిగా ఉంటుందని చెప్పాడు. నాని సూపర్బ్ పెర్ఫామర్ అని కూడా నాగ్ కితాబిచ్చాడు. ‘దేవదాసు’ అనే టైటిల్ పెట్టినంత మాత్రాన ఇందులో విషాదం ఏమీ లేదని.. ఇది వినోదాత్మక సినిమా అని నాగ్ చెప్పాడు. ఇందులో దేవ అంటే తాను అని.. దాసు అంటే నాని అని చెప్పాడు. తాను డాన్ పాత్రలో నటిస్తుంటే.. నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తాడని చెప్పాడు. దీని తర్వాత తాను ఒక తమిళ సినిమా చేయబోతున్నట్లు చెప్పిన నాగ్.. దాని గురించి ఇంకో వారంలో ప్రకటన వస్తుందన్నాడు. కళ్యాణ్ కృష్ణ కురసాల ‘బంగార్రాజు’ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని.. సీనియర్ రైటర్ సత్యానంద్ అతడికి సహకారం అందిస్తున్నాడని.. త్వరలోనే తాను నరేషన్ వింటానని నాగ్ చెప్పాడు.