Begin typing your search above and press return to search.

నాగ్ నోట కొత్త సినిమా పేరు

By:  Tupaki Desk   |   23 Jun 2016 7:40 AM GMT
నాగ్ నోట కొత్త సినిమా పేరు
X
ఇప్పటిదాకా అనుకుంటున్నదే.. ఐతే ఈ రోజు అఫీషియల్‌ గా న్యూస్ బయటికి వచ్చేసింది. అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కబోయే భక్తిరస చిత్రానికి ‘ఓం నమో వెంకటేశాయ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం ఉదయం రాఘవేంద్రరావు - నాగార్జున కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ ‘ఓం నమో వెంకటేశాయ’ అని ప్రకటించారు. తాను ఇందులో వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీంరాం బాబా పాత్రను పోషిస్తున్నట్లు చెప్పిన నాగ్.. ఈ నెల 25న షూటింగ్ ఆరంభించబోతున్న సంగతి కూడా వెల్లడించాడు. రాఘవేంద్రరావు భక్తి - ఆధ్యాత్మిక చిత్రాలన్నింటికీ రచయితగా పని చేసిన జె.కె.భారవినే ఈ చిత్రానికి కూడా కథ అందిస్తున్నాడు.

ఉత్తర భారత దేశానికి చెందిన హథీం రాం బాబా తిరుమల శ్రీవారికి గొప్ప భక్తుడు. శ్రీనివాసుని కొలుస్తూ తిరుపతిలోనే ఉండిపోయాడు. ఆయన సమాధి తిరుపతిలోనే ఉండటం విశేషం. అక్కడే హథీంరాం బాబా పేరుతో మఠాన్ని కూడా చూడవచ్చు. ఇంతకుముందు రాఘవేంద్రరావు-నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య - శ్రీరామదాసు - షిరిడి సాయి లాంటి ఆధ్యాత్మిక చిత్రాలొచ్చాయి. వీటిలో ‘షిరిడి సాయి’ మాత్రమే ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. మనం - సోగ్గాడే చిన్నినాయనా - ఊపిరి లాంటి సూపర్ హిట్లతో ఊపుమీదున్న టైంలో నాగ్ మళ్లీ భక్తిరస చిత్రం చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రంలో అనుష్క - విమలా రామన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఇప్పటికే ఈ సినిమా కోసం ట్యూన్లు సిద్ధం చేసేశారు.