Begin typing your search above and press return to search.

బ్యాచిల‌ర్ టీమ్ కి నాగార్జున కింగ్ సైజ్ పార్టీ

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:30 AM GMT
బ్యాచిల‌ర్ టీమ్ కి నాగార్జున కింగ్ సైజ్ పార్టీ
X
అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ మొత్తానికి ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` చిత్రంతో తొలి స‌క్సెస్ అందుకున్నాడు. కొన్నేళ్ల పాటు పోరాటం చేసినా అంద‌ని ద్రాక్ష‌లా మారిన స‌క్సెస్ ని బ్యాచిల‌ర్ తో అందిపుచ్చుకున్నాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇంత‌కుముందు అఖిల్ కి సరైన స‌క్సెస్ లేద‌ని ఓ చింత‌న వెంటాడేది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` స‌క్సెస్ తో అది తొల‌గిపోయింది. ముఖ్యంగా నాగార్జున ఇప్పుడు ఫుల్ జోష్ తో ఉన్నారు. ఆయ‌న‌ అఖిల్ విష‌యంలో ఎంతో అడిష‌న‌ల్ కేరింగ్ తో ఉండేవారు. త‌న‌యుడిని టాలీవుడ్ లో పెద్ద హీరోని చేయాల‌ని లాంచ్ చేసారు. కానీ నాగార్జున కు ఎదురైన‌ట్టే ఆరంభం అఖిల్ కి ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. ఇక ఇంచుమించి నాగ్ త‌న నాలుగో చిత్రంతోనే నాడు విజ‌యం అందుకున్నారు. అదే ఫీట్ ని అఖిల్ ఇప్పుడు రిపీట్ చేశాడ‌ని చెప్పాలి. కెరీర్ నాలుగో సినిమాతో విజ‌యం అందుకున్నాడు. ఇన్నాళ్లు టైమ్ క‌లిసి రాలేదు. ఇప్పుడా టైమ్ వ‌చ్చేసిందని అనుకోవ‌చ్చు. ఈ వెయిటింగ్ ఫ‌లించి ఇక‌పై అఖిల్ త‌న‌ని తాను పెద్ద స్టార్ గా మ‌లుచుకుంటాడ‌నే అభిమానులు భావిస్తున్నారు.

ఇక‌పై త‌న‌యుడి విష‌యంలో నాగ్ కి మ‌రింత బాధ్య‌త పెరిగింది. తొలి నుంచి అఖిల్ చేసే సినిమాల విష‌యంలో నాగ్ అవ‌స‌రం మేర ఇన్వాల్వ్ అయ్యారు. స్క్రిప్ట్ నాగ్ విన్న త‌ర్వాతే అఖిల్ వ‌ర‌కూ వెళ్లేది. ఆ కాన్ఫిడెన్స్ తో నే అఖిల్ ని మెగా నిర్మాత అల్లు అర‌వింద్ చేతుల్లో పెట్టారు. అర‌వింద్ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో నాగార్జున బ్యాచిల‌ర్ టీమ్ కి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు స‌మాచారం. గీతా ఆర్స్ట్ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించి స్పెష‌ల్ గా ట్రీట్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారుట‌. అర‌వింద్ ఫ్యామిలీతో నాగ్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. అఖిల్ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలోనే పార్టీ తో మ‌రింత‌గా బాండింగ్ ని పెంచుకుంటున్నారు మ‌రి.

ఇక ఇటీవ‌లే `ఎమ్.ఈ.బీ` మొత్తం యూనిట్ కి అఖిల్ కూడా పార్టీ ఇచ్చాడు. బ్యాచిల‌ర్ స‌క్సెస్ మీట్ త‌ర్వాతి రోజున అఖిల్ త‌న టీమ్ అంద‌రినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసాడు. ఈ పార్టీకి అఖిల్ స్నేహితులు.. కొంద‌రు ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు కూడా హాజ‌ర‌య్యారు. ఇప్పుడు నాగార్జున వంతు కాబ‌ట్టి అత‌ని స్నేహితులు.. స‌హ‌చ‌రులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. చిరంజీవి.. చ‌ర‌ణ్ స‌హా మెగా హీరోలంతా జాయిన్ అవ్వ‌డానికి ఆస్కారం ఉందని భావిస్తున్నారు.

ఇంటా బ‌య‌టా సంతృప్తికర ఫ‌లితం

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` (MEB) గత శుక్రవారం విడుదలై సేఫ్ జోన్ లో ప్ర‌వేశించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 20.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటింది. ఎంఇబి అఖిల్ కెరీర్ ను పునరుద్ధరించడమే కాకుండా టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా పూజా రేంజును నిరూపించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అఖిల్ మరో మైలురాయిని అధిగమించాడు. ఈ చిత్రం అమెరికా లో 5 వ రోజు 28694 డాల‌ర్ల‌ను వసూలు చేసింది. దీంతో 5 రోజుల మొత్తం 500006 (రూ. 3.74 కోట్లు) డాల‌ర్ల‌కు చేరుకుంది. MEB రాయల్ గా అర మిలియన్ క్లబ్ లోకి ప్రవేశించడంతో అఖిల్ యుఎస్ లో తన కెరీర్ బెస్ట్ ని అందుకున్నాడు. అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద హ‌లో త‌ర్వాత చ‌క్క‌ని ప్రజాదరణను పదిలం చేసుకున్నాడు. ఈ విజయం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ఎంఇబికి కొన్ని త‌ప్పులు దొర్లినా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో భాస్క‌ర్ కి గ్రిప్ ఉంద‌ని నిరూపించుకోగ‌లిగాడ‌ని టాక్ వినిపించింది. ఇక ఎంఇబి అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద ఒక మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరుతుందా? అంత లాంగ్ డ్రైవ్ సాధ్య‌మేనా? అన్న‌దానికి క్లారిటీ రావాల్సి ఉంది. అఖిల్- పూజా జంట‌ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ.. బ్యాచిల‌ర్ షిప్ క‌ష్టాల‌పై ప్రత్యేకమైన కథాంశంతో బొమ్మరిల్లు భాస్కర్ తాజా ప్రేమ కథను తెర‌కెక్కించారు. మాలీవుడ్ కంపోజర్ గోపి సుందర్ చ‌క్క‌ని సంగీతం కూడా ప్ల‌స్ అయ్యింది. బన్నీ వాస్ - వాసువర్మ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిన‌దే.

`ఏజెంట్`తో మ‌రో లెవ‌ల్ కి ...!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ విజ‌యంతో అఖిల్ పై పాజిటివ్ వైబ్స్ మొద‌లైన‌ట్టే. ఇది ఏజెంట్ కి క‌లిసి రానుంది. గూఢ‌చ‌ర్యం నేప‌థ్యంలో సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ‌లుస్తున్నార‌ని స‌మాచారం. స్పై సినిమా అంటే క‌థాంశంలో క‌చ్ఛితంగా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉంటుంది. విజువ‌ల్ గ్రాండియారిటీతో ఈ త‌ర‌హా స్పై సినిమాలు అల‌రిస్తాయి. భారీత‌నం యాక్ష‌న్ ఛేజ్ ల‌తో.. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ 007 - బార్న్ ఐడెంటిటీ రేంజులో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమాతో మ‌రో హిట్టు కొట్టి అఖిల్ త‌న స్థానాన్ని మ‌రింత‌గా స్ట్రాంగ్ గా మ‌లుచుకోవాల్సి ఉంది.