Begin typing your search above and press return to search.

పోలీస్ స్టోరీనా... వర్కవుట్ అవుతుందా??

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:30 PM GMT
పోలీస్ స్టోరీనా... వర్కవుట్ అవుతుందా??
X
సినిమాల సెలక్షన్ విషయంలో హీరో అక్కినేని నాగార్జున చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటాడు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి.. కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు తీయడానికి రెడీగానే ఉంటాడు. అలా నాగార్జున అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తరవాత టాప్ డైరెక్టర్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఈమధ్య ఫ్యామిలీ సినిమాలు చేసి బోర్ కొడుతోందని.. మాంచి యాక్షన్ ఎంటర్ టెయినర్ చేయాలని ఉందన్న నాగార్జున తన తరవాత సినిమా రామ్ గోపాల్ వర్మ చేయాలని డిసైడయ్యాడు.

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో నాగార్జున ది పోలీస్ రోల్. నాగార్జునకు పోలీస్ రోల్స్ కొత్తేమీ కాదు. నిర్ణయం.. రక్షణ.. ఆవిడా మా ఆవిడా సినిమాల్లో పోలీస్ పాత్రల్లో మెప్పించాడు. ఆర్జీవీ అయితే పోలీసుల స్టోరీలతో బోలెడు సినిమాలు తీశాడు. అతడి సినిమా స్టోరీల్లో అత్యధికం మాఫియా.. పోలీసుల చుట్టూ తిరిగినవే. ఎటొచ్చీ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య పోలీసుల కథతో తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేశాయ్. అనుక్షణం - డిపార్ట్ మెంట్ - శివ 2006 సినిమాలన్నీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. అలాంటప్పుడు మళ్లీ పోలీస్ కథే అంటే అభిమానులకు ఎక్కడో డౌట్ కొడుతోంది.

రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్ లో ఇంతవరకు నాలుగు సినిమాలు వచ్చాయి. అందులో శివ తెలుగు సినిమా చరిత్రను మార్చేసినంత బంపర్ హిట్. తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంతం.. గోవిందా గోవిందా సినిమాలు యావరేజ్ గా ఆడాయి. మళ్లీ రెండు దశాబ్దాల తరవాత నాగ్ తో సినిమా చేస్తున్న ఆర్జీవీ ఏ మేరకు మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.