Begin typing your search above and press return to search.

తనయుడిని నిలబెట్టడానికి స్టార్ హీరో ప్రయత్నాలు...!

By:  Tupaki Desk   |   9 July 2020 11:48 AM IST
తనయుడిని నిలబెట్టడానికి స్టార్ హీరో ప్రయత్నాలు...!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అఖిల్ తన శక్తినంతా ధార పోస్తున్నా గాని వర్కౌట్ అవ్వడం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. 'సిసింద్రీ' గా అలరించిన అఖిల్.. అక్కినేని మూడు తరాలు కలిసి నటించిన 'మనం' సినిమాలో తళుక్కుమన్నాడు. అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులు పడటంతో పాటు అక్కినేని ఫ్యామిలీ నుండి మరో అందగాడు ఇండస్ట్రీలోకి వచ్చాడని అందరూ భావించారు. ఈ క్రమంలో 'అఖిల్' సినిమాతో సోలో హీరోగా వచ్చిన అఖిల్ కి ఆ సినిమా ఆశించినంత విజయం అందించలేకపోయింది.

ఆ తర్వాత 'మనం' డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో రెండో సినిమాగా 'హలో' అంటూ పలకరించాడు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఇక మూడో సినిమాగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సూపర్ హిట్ మాత్రం దక్కడం లేదు. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. మరో తనయుడు నాగ చైతన్య తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అఖిల్ ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కింగ్ నాగ్. ఈ క్రమంలో అఖిల్ ని అల్లు అరవింద్ చేతిలో పెట్టారు. నాలుగో సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వీలుపడలేదు.

ఇదిలా ఉండగా అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయంలో నాగార్జున తనయుడు అఖిల్ కోసం మంచి స్టోరీలను డైరెక్టర్స్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చెప్పిన స్టోరీలను విన్న నాగ్ వాటిలో మంచి స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడట. నెక్స్ట్ సినిమా కోసం సరైన స్క్రిప్ట్ డైరెక్టర్ దొరికితే తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారట. కష్టపడేవారికి అదృష్టం కూడా కాస్త కలిసి వస్తే ఎలాంటి అడుగులు వేసినా సక్సెస్ అవుతారు అంటారు. అఖిల్ కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడైతే స్టార్ హీరో రేంజ్ కి చేసే లక్షణాలు చాలా ఉన్నాయని ఇండస్ట్రీ జనాలు అనుకుంటూ ఉంటారు. తనయుడి కోసం నాగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి అఖిల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.