Begin typing your search above and press return to search.

సోగ్గాడి రైజింగ్.. 450 టు 600

By:  Tupaki Desk   |   18 Jan 2016 7:58 AM GMT
సోగ్గాడి రైజింగ్.. 450 టు 600
X
కలెక్షన్ల లెక్కల్లో కాకుండా టాక్ పరంగా చూస్తే మాత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ మిగతా సినిమాల కంటే ఓ మెట్టు పైనుందని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే కంటెంట్ కావడం.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమా కావడం దీనికున్న పెద్ద అడ్వాంటేజ్. దీనికి తగ్గట్లే మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది ‘సోగ్గాడే చిన్ని నాయనా’. తొలి మూడు రోజుల్లో రోజుకు రూ.5 కోట్ల చొప్పున షేర్ వచ్చిందని.. తాము ఊహించినదానికంటే ‘సోగ్గాడే..’ పెద్ద సక్సెస్ అయిందని నాగార్జున సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. సక్సెస్ మీట్లో భాగంగా నాగ్ ఇంకా నాగ్ ఏమన్నాడంటే...

‘‘సాధారణంగా నా సినిమాలు 600 థియేటర్లకు అటు ఇటుగా విడుదలవుతుంటాయి. కానీ సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటం వల్ల 450 థియేటర్లలోనే రిలీజ్ చేయగలిగాం. చిన్న సెంటర్లలో పెద్దగా థియేటర్లు దొరకలేదు. ఐతే సినిమాకు మంచి టాక్ రావడంతో థియేటర్ల సంఖ్యను 600కు పెంచాల్సి వచ్చింది. మహిళలైతే తమ కోసం ప్రత్యేకంగా షోలు వేయాలని అడుగుతున్నారు. సంక్రాంతికి మాదే నెంబర్ వన్ సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సినిమాల్ని జనాల్లో ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి చూసేవారట. ఇప్పుడు నా సినిమాను కూడా జనాలు బస్సుల్లో, ట్రాక్టర్లలో వచ్చి చూస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. సినిమాలు చూడ్డం మానేసిన వాళ్లను కూడా సోగ్గాడే.. మళ్లీ థియేటర్లకు రప్పిస్తోంది’’ అని చెప్పాడు నాగ్.