Begin typing your search above and press return to search.

నాగ్ అభిమానుల్లో ఆ భయం

By:  Tupaki Desk   |   28 Dec 2019 7:25 AM GMT
నాగ్ అభిమానుల్లో ఆ భయం
X
అక్కినేని నాగార్జున కెరీర్ ఎన్నడూ లేనంత స్లంప్‌ లో ఉందిప్పుడు. ఈ ఏడాది ఆయన్నుంచి వచ్చిన ‘మన్మథుడు-2’ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా నాగ్ చడీచప్పుడు లేకుండా మరో ప్రయోగాత్మక సినిమా చేయడానికి రెడీ అయి పోయాడు. ‘మహర్షి’ సినిమాకు రచయితగా పని చేసిన సాల్మన్‌ను దర్శకుడి గా పరిచయం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాను ఆల్రెడీ పట్టాలెక్కించేశాడు నాగ్. ఇందులో నాగ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ గా కనిపించనున్నాడు. నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలో పని చేసే పోలీస్ అధికారి పాత్ర ఇది. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. అప్పుడు ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. ఆ షెడ్యూల్‌‌ లోని సన్నివేశాల నుంచే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేశారు.


ఈ ఫస్ట్ లుక్, సినిమా కాన్సెప్ట్ ఆసక్తి కరం గానే అనిపిస్తున్నాయి కానీ.. ఎంత కాదనుకున్నా నాగ్ అభిమానులకు మాత్రం ఒక డిజాస్టర్ మూవీ తలపుల్లోకి వస్తోంది. అదే.. గత ఏడాది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నాగ్ నటించిన ‘ఆఫీసర్’. నాగ్ అందులోనూ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర నే పోషించాడు. ఇప్పుడు కనిపిస్తున్న లుక్కే ఆ చిత్రంలోనూ కనిపించింది. అభిమానులు వద్దు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా పూర్ ఫామ్‌ లో ఉన్న వర్మ తో సినిమా చేసి భారీ మూల్యమే చెల్లించుకున్నాడు నాగ్. కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయని ఈ చిత్రం నాగ్ మార్కెట్‌ ను దారుణం గా దెబ్బ తీసింది. అక్కడి నుంచే నాగ్ బాగా తడబడుతున్నాడు. ఒక రకమైన నెగెటివిటీ చుట్టుకుంది ఆయన చుట్టూ. ఈ దెబ్బ తో ఇప్పుడిప్పుడే నాగ్ మళ్లీ పోలీస్ పాత్ర చేయడని అనుకున్నారంతా. కానీ ఏడాది తిరక్కుండానే ‘ఆఫీసర్’ను పోలిన పాత్ర తో వస్తున్నాడు నాగ్. మరి ‘ఆఫీసర్’ చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ ఈ చిత్రం నాగ్‌కు మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.