Begin typing your search above and press return to search.

నాగ్ ఆ క్యారెక్టర్ పై మనసు పడ్డాడు

By:  Tupaki Desk   |   12 Aug 2015 10:06 AM GMT
నాగ్ ఆ క్యారెక్టర్ పై మనసు పడ్డాడు
X
కెరీర్ లో ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాడు అక్కినేని నాగార్జున. ఐతే ఆయనకు ఇంకా సంతృప్తి లేదట. తన డ్రీమ్ రోల్ ఇదీ అని ఎప్పుడూ చెప్పని నాగ్.. తాజాగా ఓ కార్యక్రమంలో తన మనసులోని మాట చెప్పాడు. నాగ్ కోరుకున్న క్యారెక్టర్ ఏంటో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ క్యారెక్టర్ మరేదో కాదు.. రావణాసురుడు. అవును నిజం.. నాగ్ కు ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమట. బాహుబలి తరహా భారీ బడ్జెట్ సినిమాలో రావణాసురుడి టైపు క్యారెక్టర్ చేయాలన్నది తన ఆశ అని చెప్పాడు నాగ్. హైదరాబాద్ లో ‘రైజ్ ఆఫ్ కాలి’ అనే మైథలాజికల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఈ సంగతి వెల్లడించాడు నాగ్.

రావణాసురుడి పాత్రలో రెండు కోణాలున్నాయని.. ఓ కోణంలో ఆయన పెద్ద హీరో అని చెప్పాడు నాగ్. జానపద, పౌరాణిక కథలంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని చెప్పిన నాగ్.. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ఆ తరహా సినిమాలు చూస్తూ పెరిగానన్నాడు. బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ సినిమాలో తాను నటించలేకపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పాడు. అందులో నటించిన వాళ్లను చూసి అసూయగా కూడా ఉందని చెప్పాడు నాగ్. మన్మథుడు మరీ ఇంత బాధపడుతున్నాడని తెలిస్తే బాహుబలి-2లో నాగ్ కు ఓ క్యారెక్టర్ ఇచ్చేవాడేమో రాజమౌళి. నాగ్ నటించిన రాజన్న సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా.. రాజమౌళి యాక్షన్ సన్నివేశాల వరకు డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘సోగ్గాడె చిన్నినాయనా’తో పాటు కార్తి, తమన్నాలతో కలిసి ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నాడు నాగ్.