Begin typing your search above and press return to search.

నాగ్‌, కార్తి.. మంచి 'దోస్త్‌'లన్నమాట!

By:  Tupaki Desk   |   4 July 2015 11:30 AM GMT
నాగ్‌, కార్తి.. మంచి దోస్త్‌లన్నమాట!
X
నాగార్జున, కార్తి.. చాలా చిత్రమైన కాంబినేషన్‌ ఇది. నాగ్‌ ఏమో పాతికేళ్ల సీనియారిటీ ఉన్న హీరో.. కానీ కార్తీ గత ఆరేడేళ్లలో ఎదిగిన యంగ్‌ హీరో. మరి ఇద్దరూ సినిమా చేస్తున్నారంటే వీళ్లిద్దరి క్యారెక్టర్లు ఎలా ఉంటాయి..? సినిమాలో ఒకరికి ఒకరు ఏమవుతారు..? ఒకే ఏజ్‌లో కనిపిస్తారా? నాగ్‌ వయసుకు తగ్గ పాత్ర చేస్తున్నాడా? అని రకరకాల సందేహాలు మొదలయ్యాయి. ఒకప్పుడు మేనల్లుడు సుమంత్‌కు స్నేహితుడిగా నటించాడు నాగ్‌. కానీ అది పదేళ్ల ముందు. ఇప్పుడు ట్రెండు మారింది. ఇంకా కుర్రాడిలా కనిపిస్తానంటే జనాలు ఒప్పుకోరు. కాబట్టి వంశీ పైడిపల్లి సినిమాలో నాగ్‌ మిడిల్‌ ఏజ్‌ క్యారెక్టరే చేసుంటాడని అందరూ అనుకున్నారు.

ఐతే వంశీ అలాంటి ప్రయోగమేదీ చేయట్లేదని.. నాగ్‌, కార్తిలిద్దరూ ఇందులో స్నేహితులుగా నటిస్తున్నారని తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమాకు 'దోస్త్‌' అనే టైటిల్‌ కన్ఫమ్‌ అయినట్లు సమాచారం. ఇంతకుముందు ఇదే పేరుతో ఓ చిన్న సినిమా వచ్చింది. ఐతే ఆ సినిమా ఎవరికీ పెద్దగా గుర్తులేదు. అందుకే 'దోస్త్‌' టైటిల్‌ను తన సినిమాకు వాడేసుకుంటున్నాడు వంశీ. నాగ్‌, కార్తి స్నేహితులుగా నటిస్తున్నారంటే మరి తమన్నా ఇద్దరికీ హీరోయిన్‌గా నటిస్తోందా? లేక కార్తితో మాత్రమే ఆమె జతకడుతుందా? నాగ్‌కు హీరోయిన్‌ లేనట్లేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. ఓ హాలీవుడ్‌ మూవీ స్ఫూర్తితో వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని.. నాగ్‌ ఇందులో ఓ షాకింగ్‌ క్యారెక్టర్లో కనిపిస్తాడని సమాచారం.

ఈ మధ్యే ఈ సినిమా యూనిట్‌ కొత్త షెడ్యూల్‌ కోసం ఐరోపా బయల్దేరింది.