Begin typing your search above and press return to search.

చైతో కాదు ఈసారి అఖిల్ తో నాగ్..?

By:  Tupaki Desk   |   28 Feb 2022 3:30 AM GMT
చైతో కాదు ఈసారి అఖిల్ తో నాగ్..?
X
కింగ్ నాగార్జున త‌న వార‌సుల‌తో క‌లిసి న‌టించిన మ‌నం ఎంతటి చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం ద‌క్కించుకుందో తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున తండ్రి గారు లెజెండ‌రీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించారు. ఆయ‌న‌కు ఇది చివ‌రి సినిమా. ఒకే ఫ్రేమ్ లో నాగార్జున‌- నాగ‌చైత‌న్య‌- అఖిల్ క‌నిపించే స‌న్నివేశాన్ని అక్కినేని అభిమానులు మ‌ర్చిపోలేరు.

అయితే ఇలాంటి అద్భుత‌మైన ట్రీట్ మ‌ళ్లీ మ‌ళ్లీ ఇచ్చేందుకు త‌న‌యుల‌తో క‌లిసి నాగార్జున సినిమాలు చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌తో కింగ్ న‌టించిన బంగార్రాజు సంక్రాంతి ట్రీట్ అందించిన సంగ‌తి తెలిసిందే. నాగ్ - నాగ‌చైత‌న్య కాంబో స‌న్నివేశాలు అద్భుతంగా ర‌క్తి క‌ట్టించాయి.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. కింగ్ నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేనితో కలిసి న‌టించ‌నున్నార‌ని తెలిసింది. ఇది నాగార్జున‌కు వందో సినిమా కానుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ తో బిజీగా ఉన్న మోహన్ రాజా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తుండగా అఖిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

కథాంశం ఎలా ఉండ‌నుంది? అంటే.. నేటి జ‌న‌రేష‌న్ కి క‌నెక్ట్ చేస్తూ అద్భుత‌మైన క‌థాంశంతో మ‌రో లెవ‌ల్లో ఉంటుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఇక కెరీర్ లో ఎన్నో ప్ర‌యోగాలు చేసిన నాగార్జున మ‌రోసారి ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని తెలుస్తోంది. ఇది మ‌నం త‌ర‌హాలోనే క్లాసీగా కూడా ఉండొచ్చ‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.

ప్ర‌స్తుతం నాగార్జున ఘోస్ట్ సినిమాతో బిజీగా ఉండగా.. అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్ లో క‌నిపించే అద్భుత చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం మోహ‌న్ రాజా ద‌క్కించుకున్నారు. చిరంజీవి త‌ర్వాత మ‌రో అగ్ర హీరో నాగార్జున‌తోనూ ఆయ‌న ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం విశేషం. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.