Begin typing your search above and press return to search.

'దూత' అఫిషియల్ పోస్టర్: ఇంటెన్స్ లుక్ లో చైతూ..!

By:  Tupaki Desk   |   28 April 2022 1:14 PM GMT
దూత అఫిషియల్ పోస్టర్: ఇంటెన్స్ లుక్ లో చైతూ..!
X
బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ఓటీటీ వరల్డ్ లో ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించే ''దూత'' అనే సూపర్ నేచురల్-హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో చైతూ నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అమెజాన్ ఈ సిరీస్ ను అధికారికంగా ప్రకటించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు గురువారం (ఏప్రిల్ 28) తమ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ కోసం రూపొందిస్తున్న పలు కొత్త ఒరిజినల్ షోలు మరియు వాటి టైటిల్స్ ను ప్రకటించింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న ''దూత'' సిరీస్ ని కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ ని కూడా ఆవిష్కరించారు.

'దూత' సిరీస్ లో చైతన్యతో పాటుగా ప్రియా భవానీ శంకర్ - పార్వతి తిరువోతు - ప్రాచీ దేశాయ్ - తరుణ్ భాస్కర్ దాస్యం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబడుతున్న ఈ సిరీస్ కు విక్రమ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ తో పాటుగా దొండపాటి వెంకటేష్ - పూర్ణ ప్రజ్ఞ - శ్రీపాల్ రెడ్డి - నవీన్ జార్జ్ థామస్ ఈ సిరీస్ కు రచయితలుగా ఉన్నారు.

'ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో చూడండి' అంటూ తాజాగా రిలీజ్ చేసిన ''దూత'' సిరీస్ నుంచి నాగచైతన్య లుక్ ని రివీల్ చేశారు. ఇందులో చైతూ ఫోన్ మాట్లాడుతూ ఇంటెన్స్ గా చూస్తూ ఉన్నారు. కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్న చై మీసకట్టు సరికొత్తగా ఉంది.

ఇకపోతే ఈ సిరీస్ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇది అక్కినేని హీరో కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచి పోతుందని అంటున్నారు. ముంబైలో జరిగిన 'దూత' అనౌన్స్ మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు నాగచైతన్య - విక్రమ్ కె కుమార్ లతో పాటుగా మిగతా టీమ్ అంతా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ.. ''అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ ఫారమ్‌ తో మేము కలుస్తున్నాం. ఇది పాన్ ఇండియా కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. నేను హారర్ సినిమా చూస్తూ ఐదు నిమిషాలు కూడా కూర్చోలేను. విక్రమ్ నాకు ఇదొక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ అని చెప్పినప్పుడు.., ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నటుడిగా ఇది నాకెంతో సవాల్‌ తో కూడుకున్నది'' అని అన్నారు.

నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబోలో గతంలో 'మనం' వంటి కల్ట్ క్లాసిక్ మూవీ వచ్చింది. ఇదే క్రమంలో 'థాంక్యూ' అనే మరో మూవీ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు ''దూత'' వెబ్ సిరీస్ కోసం చై - విక్రమ్ మరోసారి కలిశారు. 2022 థర్డ్ క్యార్టర్ లో ఈ సిరీస్ విడుదల కానుంది. డిజిటల్ డెబ్యూతో చైతూ పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.