Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికల వేళ.. హాట్ టాపిక్ గా మారిన నాగబాబు మాట

By:  Tupaki Desk   |   26 Jun 2021 7:30 AM GMT
‘మా’ ఎన్నికల వేళ.. హాట్ టాపిక్ గా మారిన నాగబాబు మాట
X
మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోపలి వాతావరణం ఎంతా వేడెక్కిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు మీడియాలో వస్తున్న వార్తలతో ప్రకాశ్ రాజ్ అండ్ టీం బయటకు వచ్చేసింది. ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి తమ టీం జెండా.. ఎజెండా విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా.. అందరిని కలుపుకుపోతామన్న మాటను అదే పనిగా చెప్పే ప్రయత్నం చేశారు ప్రకాశ్ రాజ్ అండ్ టీం. నిర్మాత కమ్ నటుడు బండ్ల గణేశ్ సైతం మైకు పట్టుకొని తాజా పరిస్థితికి తగ్గట్లు మాట్లాడారని చెప్పాలి. ఆయన మైక్ పట్టుకున్నంతనే మరేదో జరుగుతుందని ఆశించిన వారికి నిరాశను కలిగించారు. ఏదో ఒక మాట మాట్లాడి కొత్త రచ్చకు కారణమవుతారన్న అంచనా తప్పని తేల్చారు. మిగిలిన వారందరితో పోలిస్తే.. అందరిని కలుపుకుపోతాం.. ఇప్పటివరకు పని చేసిన ‘మా’ కార్యవర్గాలన్ని బాగా పని చేశాయని.. తమకు ఎవరి విషయంలోనూ ఎలాంటి అభ్యంతరాలు లేవన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సమావేశం ప్రారంభం నుంచి లేని మెగా బ్రదర్ నాగబాబు.. మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తర్వాత మిగిలిన వారి చేత మాట్లాడించే క్రమంలో నాగబాబు చేత మాట్లాడారు. ఆయన మాటలు కాస్త ఓవర్ ల్యాపింగ్ అయ్యాయి. ఫర్లేదు.. సర్దుకోవచ్చన్న వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట కొత్త చర్చకు తెర తీసింది. గడిచిన నాలుగైదేళ్లుగా ‘మా’ ప్రతిష్ఠ మసకబారిందని.. ఆ విషయంలో తాము కాస్త కలత చెంది ఉన్నట్లుగా చెప్పటం ద్వారా.. మరో కొత్త పంచాయితీకి తెర తీశారు. గడిచిన నాలుగైదేళ్ల కాలాన్ని తీసుకుంటే.. అప్పట్లో ఎన్నికైన కార్యవర్గాలన్ని మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సుల్లో గెలిచిన వారే అన్న విషయం తెలిసిందే.

అందరిని కలుపుకుపోదాం.. ఎవరిని చేజార్చుకోవద్దన్నట్లుగా ఉన్న ప్రకాశ్ రాజ్ వ్యూహానికి భిన్నంగా నాగబాబు మాట ఉండటం ఇప్పుడు సరికొత్త మాటల యుద్ధానికి తెర తీస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ‘మా’ ఎన్నికల సందర్భంగా తమకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేవని.. మీడియానే అంతా చేస్తుందన్నట్లుగా ప్రకాశ్ రాజ్ మాటలకు ఏ మాత్రం పొంతన లేకుండా నాగబాబు నోటి నుంచి వచ్చిన ‘మసకబారటం’ మాట కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. ప్రకాశ్ రాజ్ వర్గానికి పోటీగా బరిలో నిలుస్తున్న వారికి సరికొత్త అస్త్రాన్ని ఇచ్చేలా చేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.